Srisailam | హైదరాబాద్; శ్రీశైలంలో మరో శివలింగం బయటపడింది. యాఫి థియేటర్ సమీపంలో సీసీ రోడ్డు పనుల్లో భాగంగా జేసీబీతో తొవ్వుతుండగా శివలింగం వెలుగుచూసింది. శివలింగంతోపాటు నంది విగ్రహం, ఓ లిపి కూడా ఉన్నాయి. విషయం తెలిసిన ప్రజలు అక్కడికి చేరుకొని పూజలు చేశారు. స్పందించిన పురావస్తు శాఖ అధికారులు అక్కడికి చేరుకొని లిపిని ఆర్కియాలజీ ల్యాబ్‌కు తీసుకెళ్లారు.
రెండు నెలల్లో 376 డెంగీ కేసులు
వెల్లడించిన వైద్యారోగ్య శాఖ
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గత రెండు నెలల్లో 376 డెంగీ కేసులు వెలుగుచూసినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది. సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది మేలో 113 డెంగీ, 21 మలేరియా కేసులు, జూన్‌లో 263 డెంగీ, 9 మలేరియా కేసులు నమోదైనట్టు వెల్లడించారు. గతేడాదితో పోల్చితే ఈ కేసుల సంఖ్య తగ్గినట్టు తెలిపారు. సమీక్షలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, డీపీహెచ్ రవీంద్రనాయక్, డీఎంఈ వాణి, ఐపీఎం డైరెక్టర్ శివలీల పాల్గొన్నారు.
7న ముదిరాజ్‌ల సమావేశం
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 7న ఉదయం 10 గంటలకు అంబర్‌పేటలోని సత్యకమల ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముదిరాజ్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చులకనగా చూస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, మంత్రి పదవుల్లో ఒక్కటి కూడా ముదిరాజ్‌లకు ఇవ్వలేదన్నారు. సమావేశానికి అన్ని జిల్లాల నుంచి ముదిరాజ్ నేతలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
అటవీశాఖకు రూ.2.70కోట్లు విడుదల
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): అటవీ, పర్యావరణశాఖకు రాష్ట్రప్రభుత్వం రూ.2.70 కోట్ల నిధులను విడుదల చేసింది. వన్యప్రాణుల దాడుల్లో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించేందుకు ఈ నిధులను కేటాయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ విభాగానికి నిధులను విడుదల చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.