హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర కాంగ్రెస్‌కు, రాహుల్‌గాంధీకి మధ్య ‘ఆయన’ అడ్డుగోడలా నిలబడ్డారా? అధిష్ఠానం పెద్దల నుంచి ఆయనే ముఖ్యనేతను కాపాడుతున్నారా? ఆయన నీడలోనే ముఖ్యనేత రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారా? ముఖ్యనేత పదవికి అడ్డొచ్చేవారిని ‘ఆయన’ ఏదోరకంగా అభాసుపాలు చేసి తప్పిస్తున్నారా? సూట్‌కేసుల విషయం చెప్పి ఒక సీనియర్ మంత్రిని ఢిల్లీ పెద్దల దగ్గర ఇరికించారా? మరో సీనియర్‌ను తప్పించేందుకు సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా వ్యూహం పన్నారా? చివరికి అతి సామాన్యురాలిగా గుర్తింపు ఉన్న ఢిల్లీ దూతను కూడా రాజ్యాంగేతర శక్తిగా బదనాం చేశారా? దీంతో తెలంగాణలో అంచనా వేసిన స్థాయిలో ఆమె ఫలితాలు రాబట్టలేకపోయారని స్వయం గా రాహుల్ నోటితోనే అనిపించారా? అందుకే ఆమె అవమానభారంతో బాధ్యతల నుంచి తప్పుకొంటున్నారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్న చర్చ ఇది. మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్‌కు, రాహుల్‌కు మధ్య సైంధవుడిగా నిలబడి ముఖ్యనేతను రక్షిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
తగ్గిన ముఖ్యనేత ప్రభావం
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యనేత బలం అమాంతంగా పెరిగింది. సోనియా, రాహుల్, ప్రియాంక మొదలు చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఆహా.. ఓహో అని కొనియాడారు. ఆపై కొంతకాలంపాటు హస్తినలో ఆయన హవా కొనసాగింది. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత క్రమేపీ తిరోగమనం మొదలైంది. ఎన్నికల ఫలితాలు ఆశించిన మేర రాకపోవడం, పాలనా వైఫల్యాలు, కాంగ్రెస్ పెద్దలతో వైరం వంటివాటితో ఢిల్లీ కాంగ్రెస్ ఇబ్బంది పడింది. రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్లం రాజు ఇల్లు కూలగొట్టడం, మరో సీనియర్ కాంగ్రెస్ నేత కేపీవీ రామచందర్‌రావు నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు కట్టుకున్నారని బహిరంగంగా ప్రకటించటం, హైడ్రా పేరుతో బుల్డోజర్లను పేదల ఇండ్లమీదికి పంపడం తదితర చర్యలతో ముఖ్యనేతపై కాంగ్రెస్ అధిష్ఠానం అప్పట్లో సీరియస్ అయినట్టు ప్రచారం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ను దెబ్బకొట్టారని, అనేకచోట్ల గెలుపు గుర్రాలకు బదులు బలహీన అభ్యర్థులను నిలబెట్టారని, బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీకి నివేదికలు అందాయి. దీంతో రాహుల్‌గాంధీ సీరియస్ అయ్యారని, కొన్నాళ్లపాటు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. అనేకసార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్, ప్రియాంక కలువలేదని గుర్తుచేస్తున్నారు. రుణమాఫీ సభ, రాజీవ్‌గాంధీ విగ్రహావిషరణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా రాహుల్ కలవలేదని, తెలంగాణకు రావటానికి ఇష్టపడలేదని కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.
కీలక నేత అభయహస్తం
ఢిల్లీలో పరపతి పూర్తిగా పడిపోయిన సమయంలో దక్షిణాదికి చెందిన ఒక కీలక ఏఐసీసీ నేతను ముఖ్యనేత శరణుకోరినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు కావాల్సింది సమర్పించి, ఈ ఆపద నుంచి తనను గట్టెక్కించాలని ప్రాధేయపడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు ఏఐసీసీకి, ఇటు కాంగ్రెస్ అధినేతకు మధ్య సంధానకర్తగా ఉన్న సదరు కీలకనేత ప్రసన్నుడై, అభయ హస్తం ఇచ్చారని, అప్పటి నుంచే ముఖ్యనేత జాతకం మారిపోయిందని చెప్పుకుంటున్నారు. ఆయన తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టారని, పార్టీ, ప్రభుత్వంలోని సీనియర్లు, ప్రజాప్రతినిధులు ఎవరెవరు అధిష్ఠానానికి టచ్‌లో ఉన్నారు? జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా ఎవరు చేరవేస్తున్నారు? అనే సమాచారం సేకరించారని సమాచారం. కొం దరు సీనియర్లు ముఖ్యనేత పదవిపై కన్నేసినట్టు, వివిధ ప్రయత్నాలు చేస్తున్నారని తేల్చారట. అప్పటి ఢిల్లీదూత ఉదాసీనత వల్లే ఇదంతా జరుగుతున్నదని గుర్తించి, మొదట ఆమెను అదునుచూసి తప్పించారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఆమె స్థానంలో రాహుల్‌గాంధీకి అత్యంత నమ్మకస్తురాలిని ఎంపికచేసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి హైదరాబాద్‌కు పంపినట్టు చర్చ జరుగుతున్నది.
ఆయన సూచనతో రాజీ అస్త్రం
ఢిల్లీ కీలక నేత సలహా మేరకు ముఖ్యనేత తన పరిపాలనా వైఫల్యాలను పకనబెట్టి క్యాబినెట్ మంత్రులపై దృష్టిపెట్టినట్టు సమాచారం. తనతో విభేదించే మంత్రులను, భవిష్యత్తులో తన సీటుకు ముప్పుగా మారే అవకాశం ఉందనుకున్న మంత్రుల ను టార్గెట్ చేసినట్టు తెలిసింది. ముందుగా రాజీ అస్త్రం సంధించారని, ఇకపై వారి శాఖల్లో వేలు పెట్టనని, ఆయా శాఖల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, ‘మీ మీ శాఖలకు సంబంధించిన పనుల కోసం నా దగ్గరికి ఎవరైనా వస్తే.. నేరుగా మీ వద్దకే పంపిస్తా’ అంటూ వారికి నమ్మకంగా చెప్పినట్టు చర్చ జరిగింది. దీంతో ముఖ్యనేతకు ప్రధాన పోటీదారులు అనుకున్న ముగ్గురు మంత్రులు రెచ్చిపోయారని, ఒకాయన 15 శాతం కమీషన్ దుకాణం తెరిస్తే, మరొకరు రెట్టింపు వాటాలతో గల్లపెట్టెలు తెరిచినట్టు సమాచారం. కీలక పోటీదారుగా ఉన్న ఇంకో మంత్రి తన శాఖలోనే వడ్లను పిండి రూ.600 కోట్ల తైలం తీసినట్టు ప్రచారం జ రిగింది. వీళ్లను చూసిన మిగతా మంత్రులు అడుగగా ‘మీరు కూడా మీమీ శాఖల్లో ఇబ్బందులు లేకుండా చకబెట్టుకోండి’ అని సలహా ఇచ్చినట్టు తెలిసింది.
ఒక్కొక్కరుగా ఇరికించి
సీనియర్ మంత్రి ఒకరు అప్పట్లో రెండు సూట్‌కేసులతో ఢిల్లీకి వెళ్లినట్టు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. వాటిని పెద్దలకు ఇచ్చారని, తెలంగాణ అధికారపగ్గాలు అప్పగిస్తే తాను కూడా ఢిల్లీకి కప్పం కట్టగలననే సంకేతం ఇచ్చినట్టు గుసగుసలు వినిపించాయి. ఈ విషయాన్ని పసిగట్టిన ఢిల్లీ కీలకనేత వెంటనే తెలంగాణ ముఖ్యనేతకు ఫోన్ చేసి అలర్ట్ చేసినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన ముఖ్యనేత తన ఇంటెలిజెన్స్‌ను ప్రయోగించి రెండు సూటుకేసులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసి, వాటికి సంబంధించిన పూర్తి నివేదిక తెప్పించుకున్నట్టు తెలిసింది. ఇదే నివేదికను సదరు సీనియర్ మంత్రి ముందు పెట్టి, పలానా కొనుగోళ్ల విషయంలో భారీస్కామ్ జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశిస్తున్నానని భయపెట్టి ఆయన్ను లొంగదీసుకున్నట్టు అప్పట్లో గాంధీ భవన్లో గుసగుసలు వినిపించాయి. మరో సీనియర్ నేత బిల్లుల్లో 20 శాతం కమీషన్ తీసుకుంటూ ఆర్థికంగా బలోపేతం అయ్యారని, తన పదవికి ఎసరు తెచ్చే స్థాయికి ఎదిగారని గుర్తించిన ముఖ్యనేత, స్వయంగా తన అనుచరులను కొందరిని పంపి బిల్లులు ఇప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ ఆధారాలను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపినట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఢిల్లీ కీలకనేత సూచన మేరకు కొంతమంది కాంట్రాక్టర్లను పోగేసి ఏ కంగా సచివాలయం వద్ద ధర్నా చేయించి నేరుగా అధిష్ఠానం దృష్టిలో పడేటట్టు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ దెబ్బకు సదరు మంత్రి పదవి ఊడిపోయే వరకు వచ్చిందని ప్రచారం జరిగింది.
దూత అవసరం తీరిందని…
ఇప్పుడున్న ఢిల్లీ దూత అవసరం తీరిపోవటంతో ఏఐసీసీ కీలకనేత ఆమెను కూడా రాష్ట్రం దాటించే ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో పార్టీ ఆశించిన ఫలితాలను ఆమె రాబట్టలేకపోయారని స్వయంగా రాహుల్‌గాంధీతోనే అనిపించినట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు ఆమె రాజ్యాంగేతరశక్తిగా ఎదిగారని, ప్రభుత్వానికి సమాంతరంగా పాలన చేస్తున్నారని అభాండాలు వేసి ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో ఆమె రాష్ట్ర రాజకీయాల్లో ఇమడలేక తనంతట తానే బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు చెప్తున్నారు. ఆమె స్థానంలో ఏఐసీసీ కీలకనేతకు సన్నిహితంగా ఉండే సీనియర్ కాంగ్రెస్ నేతను ఇక్కడికి పంపే ఆలోచనతో ఉన్నట్టు తెలిసింది. దీంతో రాష్ట్రం పూర్తిగా ముఖ్యనేత ఆధీనంలోకి వెళ్లిపోతుందనే భయంలో కాంగ్రెస్ మంత్రులు, నేతలు ఉన్నట్టు తెలిసింది. ఇదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని సీనియర్ నేతలు మదనపడుతున్నారట. ఏఐసీసీ కీలకనేత, ముఖ్యనేత ఆడుతున్న నాటకాన్ని ఇప్పుడున్న ఢిల్లీదూత ద్వారానే రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం. కానీ, ఈ వి షయంలోనూ ఏఐసీసీ కీలకనేత సైంధవుడిలా అడ్డుకొని ముఖ్యనేతను రక్షిస్తాడని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కీలకనేత ట్రాప్‌లో దూత
ముఖ్యనేత హామీతో రెచ్చిపోయిన మంత్రులు ప్రత్యేక ఏజెంట్ వ్యవస్థ ఏర్పాటుచేసుకొని వాటాలు, కమీషన్లు, కసరత్తులు చేసి అందినకాడికి దోచుకోవడం మొదలుపెట్టినట్టు, దాదాపు 18 శాఖల్లో అడ్డూఅదుపు లేకుండా అవినీతి పెరిగిపోయినట్టు ఇంటెలిజెన్స్ నివేదించింది. ముఖ్యనేత తన దగ్గరకు పనుల కోసం వచ్చిన వారిని ఆయాశాఖల మంత్రులతో కలిసి మాట్లాడుకోవాలని చెప్పించడం, ఒకోసారి నేరుగా తన మనుషులనే మంత్రుల వద్దకు పంపించి తనకేమీ ఉచితంగా చేసి పెట్టవద్దని, మిగిలినవారి వద్ద ఎంత తీసుకుంటారో అంతకు రెండు పైసలు ఎకువే తీసుకొని పనిచేసి పెట్టాలని కోరేవారని సమాచారం. అవినీతిలో మంత్రులు ఎంతదూరం వెళ్లాలో అంతదూరం వెళ్లాక, ముఖ్యనేత ఢిల్లీ దూతకు ఫిర్యాదు చేయించడం మొదలు పెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరిగింది. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అవినీతికి సంబంధించిన పకా ఆధారాలు తెప్పించి ఒకో మంత్రి చిట్టాను ఢిల్లీ దూతకు అందించినట్టు సమాచారం. అదే సమయంలో ఢిల్లీ కీలకనేత కూడా రాష్ట్ర వ్యవహారాలపై వివరాలు అడుగుతూ.. అవినీతి మీద దృష్టిపెట్టాలని ఢిల్లీ దూతకు సూచించేవారని సమాచారం. సహజంగానే అవినీతి వ్యవహారాలపై కఠినంగానే వ్యహరించే ఢిల్లీ దూత దృష్టి పూర్తిగా వారి ట్రాప్‌లోకి వెళ్లిపోయి మంత్రుల అవినీతిపై అధిష్ఠానానికి నివేదికలు పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.