హైదరాబాద్,నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది శీతాకాలం ప్రా రంభం నుంచే చలి తీవ్రత అధికమైంది. దీంతో వారంరోజులుగా అనేక ప్రాంతా ల్లో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్, చాలా ప్రాంతాల్లో 12డిగ్రీల కంటే తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబా ద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో అత్యంత కనిష్ఠంగా 8.2 డిగ్రీలు నమోదైనట్టు వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా 8.2 నుంచి 15.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. రాబోయే రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. హైదరాబాద్ నగరంలో శుక్రవారం కొన్ని చోట్ల 10-11 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.