ఇంద్రవెల్లి, అక్టోబర్ 5: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో నిర్మించిన ఇంటితోపాటు మండల కేంద్రంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న మరో ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశాల మేరకు శనివారం వేకువజామున రెవెన్యూ, ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో నేలమట్టం చేశారు. దీంతో ఇండ్లు కోల్పోయిన బాధితులతోపాటు మండలంలోని అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, గిరిజనేతరులు ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయం ఎదుట ప్రధాన రోడ్డుపై బైఠాయించి 2 గంటలపాటు రాస్తారోకో చేశారు.
ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్గౌడ్తోపాటు ఉట్నూర్, ఇచ్చోడ సీఐలు మొగలి, భీమేశ్, ఇంద్రవెల్లి ఎస్సై సునీల్, గుడిహత్నూర్ ఎస్సై ఇమ్రాన్ ఆందోళనకారులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ వచ్చి నాయకులతోపాటు గిరిజనేతరులతో చర్చించి సమస్యను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి పంచాయతీ అధికారులతోపా టు ఇతర మండలాలకు చెందిన వారు ఏజెన్సీలో ఇండ్ల నిర్మాణం చేయరాదని బెదిరించడంతోపాటు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంద్రవెల్లి పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించిన సబ్ కలెక్టర్.. అధికారులపై, ఇండ్లకు డబ్బు అడిగిన వారిపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.