రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించ కపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించు కునేవారు చేతిలో పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అటక్కెక్కించడంతో చేనేతరంగం చితికిపోయింది.
దీంతో నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండేపల్లి శివారులోని కేసీఆర్ నగర్‌కు చెందిన బోయిని సదానందం (36) అనే నేత కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో నిన్న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ సదానందం చెందాడు. సదానందం మృతితో కేసీఆర్ నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.