సూర్యాపేట రూరల్, ఫిబ్రవరి 18 : సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థిని శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇటీవల అదే గురుకుల పాఠశాలకు చెందిన ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థిని డీ వైష్ణవి కళాశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగిన రాత్రే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటుచేసుకున్నది. మోతె మండలం బురకచర్ల గ్రామానికి చెందిన ఇరుగు ఆనంద్-జ్యోతి దంపతుల కుమార్తె ఇరుగు అస్మిత (15) పదోతరగతి చదువుతున్నది. ఈ నెల 10న వైష్ణవి మృతి చెందడంతో విద్యార్థులు భయపడకుండా ఉండేందుకు పాఠశాల, కళాశాలకు 4 రోజులపాటు సెలవులు (హోం సిక్) ప్రకటించారు. అస్మిత తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ హైదరాబాద్‌లో ఉంటున్నది. పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో అస్మిత తన తల్లి వద్దకు హైదరాబాద్ వెళ్లింది. శనివారంతో సెలవులు ముగియడంతో స్కూల్‌కు వెళ్లాలనుకున్నది. తన తల్లి పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నది. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడటంతో పాఠశాల విద్యార్థులు, వారి కుటుంబాలు, బంధుమిత్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అస్మిత మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి సొంత గ్రామం బురకచర్లకు తీసుకొచ్చారు.
విచారణ చేపట్టాలి : ఎమ్మెల్సీ కవిత
ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలకు చెందిన చెందిన ఇద్దరు విద్యార్థినులు కొద్దికాలం వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది? విద్యార్థులు ఎందుకు ఇలా వరుస ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ప్రభుత్వం విచారణ చేపట్టాలని కోరారు. పూర్తి స్థాయిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేకపోవడంతో ఇలాంటి అనేక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేకపోతున్నదని పేర్కొన్నారు. పూర్తిస్థాయి సంక్షేమ శాఖ మంత్రి నియమించడంతోపాటు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.