మధిర (చింతకాని), మార్చి 1 : సాగు చేసిన మిర్చి పంట దిగుబడి రాక.. ఎంతో కొంత చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేక.. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓ రైతు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చిన్నమండవ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం చిన్నమండవ గ్రామానికి చెందిన అగ్గిరాముడు (40) కొన్నేండ్లుగా సొంత భూమితోపాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పలు రకాల పంటలు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది మూడెకరాల్లో మిర్చి సాగు చేయగా ఆశించిన దిగుబడి రాకపోవడంతోపాటు చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోయాడు. అప్పు రూ.5 లక్షలు, వాటికి సంబంధించిన వడ్డీ ఎలా తీర్చాలో తెలియక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.