PawanKalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాడు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పవన్ చేసిన ‘OG’ వంటి సీరియస్ యాక్షన్ సినిమా కంటే భిన్నంగా గతంలో సురేందర్ రెడ్డి అందించిన ‘కిక్’, ‘రేసుగుర్రం’ తరహాలో పక్కా హై-వోల్టేజ్ కామెడీ ఎంటర్టైనర్ను పవన్ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే మేనరిజమ్స్‌తో కూడిన వినోదాన్ని వెలికితీయడమే లక్ష్యంగా రచయిత వక్కంతం వంశీ ఈ స్క్రిప్ట్‌ను రూపొందించినట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా హీరోయిన్ ఇమాన్వీ (Imanvi) పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం విశేషం.
మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఏమిటంటే, ఇందులో పవన్ కళ్యాణ్‌కు తమ్ముడిగా ఒక యువ అగ్ర హీరో నటించే అవకాశం ఉందని, అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే పక్కా మాస్ ఎంటర్టైనర్గా ఇది ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామ్ తాళ్లూరి దాదాపు రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతల నడుమ షూటింగ్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2026 మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఇప్పటికే పవన్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మార్చి 26, 2026న విడుదల కానుండగా, ఆ వెంటనే ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.