సాగు కలిసిరాక మనస్తాపం
మహబూబాబాద్ జిల్లాలో అప్పులభారంతో బలవన్మరణం
డోర్నకల్, ఫిబ్రవరి 12: సాగు కలిసి రాక.. అప్పుల భారం మోయలేక మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం చిలుక్కోయల పాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. చిలుక్కోయలపాడుకు చెందిన రైతు, మన్నెగూడెం పీఏసీఎస్ డైరెక్టర్ గజ్జి రమేశ్ (45) వ్యవసాయ పెట్టుబడి కోసం రూ. 20 లక్షలు అప్పు చేశాడు. తనకున్న రెండెకరాల భూమితోపాటు, మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకు ని మిర్చి తోట, వరి పొలం సాగుచేశాడు. నిరుడు వ్యక్తిగత అవసరాల కోసం ఎకరం భూమి అమ్ముకున్నాడు. ఈ క్రమంలో అప్పుల బాధ తట్టుకోలేక ఈ నెల 5న వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు. ఖమ్మంలోని ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
మనోవేదనతో ట్రిపుల్ ఆర్ బాధిత రైతు మృతి ; యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో విషాదం
చౌటుప్పల్, ఫిబ్రవరి 12 : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోతున్న రైతు మనోవేదనతో అనారోగ్యానికి గురై మృతి చెందాడు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన రైతు చింతల వెంకట్రెడ్డి (70)కి స్థానికంగా 30 గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం తీసిన అలైన్మెంట్లో ఆయన భూమి మొత్తం పోతున్నది. నెలరోజుల కిందట రెవెన్యూ అధికారులు సర్వేకు రాగా, అప్పటినుంచి తీవ్ర మనోవేదన చెందుతూ అనారోగ్యం బారిన పడ్డాడు. దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించి మరణించాడు.