రేగొండ, ఫిబ్రవరి 28 : దిగుబడులు రాక.. పెట్టుబడులు భారమై జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం వెంకటేశ్వర్లుపల్లె గ్రామంలో అప్పుల బాధతో మిర్చి రైతు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బండారు రవి (54) తనకున్న రెండెకరాల భూమిలో మిర్చి పంటను సాగు చేశాడు.
పంటకు నల్లితెగులు రావడంతో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టి పురుగుల మందులు కొట్టాడు. మిర్చి పంట పేరు మీద రూ. 4 లక్షలు ఖర్చు చేశాడు. పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేకపోవడంతోపాటు గతంలో మిర్చిపంట నిమిత్తం చేసిన మరో రూ. 5 లక్షల అప్పు ఎలా కట్టాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో గురువారం పంటచేను వద్దకు వెళ్లి అక్కడే ఉన్న గడ్డిమందు తాగాడు. గమనించిన తోటి రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా రవిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు.