మాదాపూర్, ఫిబ్రవరి 6: హైదరాబాద్ నగరం ప్రపంచంలోని అగ్ర నగరాలతో పోటీ పడుతున్నదిని, మహ నగరం చుట్టుపక్కల ఉన్న 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన హైదరాబాద్ క్రెడాయ్ ప్రాపర్టీ షో 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు విచ్చేసి క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఎన్.జైదీప్‌రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ బి.జగన్నాథరావు, జనరల్ సెక్రటరీ క్రాంతి కిరణ్‌రెడ్డి, క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ .. హైదరాబాద్ మహానగరం ప్రపంచంలో మేటి నగరాలతో పోటీపడుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రెండు సంవత్సరాల్లో రూ.20వేల కోట్లను కేటాయించామని అన్నారు.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ (హెచ్-సిఐటిఐ) కింద రూ.7,032 కోట్లకు పైగా పెట్టుబడులతో 45 ప్రధాన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, 10 రోడ్డు విస్తరణ ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ పరిసరాల్లో రూ.1090 కోట్లు వెచ్చించి వివిధ ప్రాజెక్టులు చేపడుతున్నామని తెలిపారు. పడమటి కారిడార్‌లో ఐఐఐటీ, ఖాజాగూడ వద్ద రూ.837 కోట్లతో మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు, నాలెడ్జ్ ఎకానమికి తోడ్పడుతున్నాయని, రూ.70 కోట్లతో వెస్ట్రన్ సిటీ ప్రధాన రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు.
ఉత్తర భాగంలో ఆర్మీ ఆర్డినెన్స్ సెంటర్ సమీపంలోని ప్రత్యామ్నాయ రహదారి నెట్‌వర్క్‌లు, ఏండ్ల నాటి ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు రూ.960 కోట్లతో పనులను చేపట్టినట్లు తెలిపారు. తూర్పు హైదరాబాద్‌లో టీకెఆర్ కళాశాల గాయత్రి నగర్, మండమల్లమ్మ జంక్షన్ వద్ద ైప్లె ఓవర్ల కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ.416 కోట్లతో పనులను చేపడుతున్నట్లు తెలిపారు. దక్షిణ భాగంలో వేగంగా విస్తరిస్తున్న పట్టణాభివృద్ధికి రోడ్లు విస్తరణ ప్రాజెక్టులకు రూ.863 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కింద క్యూర్-ప్యూర్-రేర్ వ్యూహం రాష్ట్ర అభివృద్ధిలో కోర్ అర్బన్ రీజియన్ ఎకానమిని కేంద్రంగా ఉంచనుందన్నారు.
విశ్వాసం, పారదర్శకత, నైతిక పద్ధతులు, వినియోగదారుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే క్రెడాయ్ ప్రధాన సిద్ధాంతమైన క్రెడాయబిలిటీ ఆధారంగా ఈ ప్రాపర్టీ షో పర్మినెంట్ హో జావో… అనే నేపథ్యంలో ముందుకు వచ్చినట్లు క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. గృహ కొనుగోలుదారులను హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు, దీర్ఘకాలిక హమీతో ఈ నగరాన్ని తమ శాశ్వత నివాసంగా మార్చుకోవడానికి ప్రోత్సహించే ఆత్మవిశ్వాసంతో కూడిన పిలుపుగా చెప్పారు.
ఈ ప్రదర్శనలో 300కు పైగా రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. దీని వల్ల సందర్శకులు ధృవీకరించబడిన, విశ్వసనీయమైన ప్రాజెక్టులను మాత్రమే సంప్రదించగలరనే భరోసా కలుగుతుందన్నారు హైదరాబాద్‌లోని సుస్థిర నివాస ప్రాంతాలు, అభివద్ధి చెందుతున్న వృద్ధి కారిడార్‌లోని అపార్ట్మెంట్లు, విల్లాలు, కార్యాలయ స్థలాలతో సహ సమగ్ర శ్రేణి నివాస, వాణిజ్య ఆఫర్లను ఒకే వేదికపై సందర్శించవచ్చని అన్నారు.