మేడ్చల్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ)/శామీర్‌పేట: కాంగ్రెస్ నేతల గూండాగురి పరాకాష్టకు చేరింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో ఏకంగా బీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడుతున్నారు. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడిమలక్పేటలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు.

ఈ ఘటనలో దళితుడైన బీఆర్ఎస్ నేత ఢిల్లీ పరమేశ్, మరో నేత శివకుమార్ గాయపడ్డారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోయి ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డిలపైనా దాడికి యత్నించగా, వారి గన్మెన్లు, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.
లాల్‌గడి మలక్‌పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి వనజా శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం వనజ శ్రీనివాస్‌రెడ్డి ఇంటి ఎదుట కావాలనే డీజే సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసి పెద్ద సౌండ్లను పెట్టారు. సమావేశం జరుగుతన్నందున డీజే సౌండ్‌ను చిన్నగా చేయాలని లేదా ఇక్కడి నుంచి పక్కన పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ శ్రేణులు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సమావేశాన్ని అడ్డుకునేందుకు డీజే సౌండ్‌ను మరింత పెంచి డీజే వాహనానికి తాళం వేశారు.

అంతేకాకుండా బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తున్న వనజా శ్రీనివాస్‌రెడ్డి ఇంటి వద్దకు కాంగ్రెస్ శ్రేణులను రప్పించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి చేయించేలా పథకం రచించారు. కావాలని ఘర్షణపడి బీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు. ఈ దాడిలో దళిత నేత ఢిల్లీ పరమేశ్, మరో నేత శివకుమార్ గాయపడ్డారు. అంతటితో ఆగకుండా సమావేశం జరుగుతున్న ఇంట్లో ఉన్న ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డిలపై దాడికి యత్నించగా ఎమ్మెల్యేల గన్మెన్లు, బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఇంటి గేటును మూసివేసి ఉంచడంతో పోలీసుల ముందే గేటెక్కి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లతో దాడి చేశారు.

ఇంత జరుగుతున్నా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాగా, బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసిందే కాకుండా.. పోలీసుల ముందే అధికారం బలం చూయించారు. అక్కడే ధర్నాకు దిగడం విస్మయం కలిగించింది. పోలీసులు కూడా కాంగ్రెస్ శ్రేణుల ధర్నాను నివారించలేక ప్రేక్షకుల్లా ఉండిపోయారు. బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని జీనోమ్ వ్యాలీ పోలీస్‌స్టేషన్ ఎదుట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు గజ్జెల నాగేశ్‌లు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించారు.

గన్మెన్లు బీఆర్ఎస్ శ్రేణులు లేకుంటే కాంగ్రెసోళ్లు మమ్మళ్లీ సంపెటోళ్లని ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. ‘ప్రజల వద్దకు పోయే ముఖం లేక మా పై దాడులు చేస్తారా’ అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఇలాంటి ద్యౌర్జనాలు చేస్తున్నదన్నారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
