హైదరాబాద్,నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మలక్కా జలసంధి దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ క్రమంలో సోమవారం పశ్చిమ, ఉత్తర దిశగా కదిలి ఆగ్నేయ బంగాళాఖాతంలో దీనికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ మీదుగా వాయుగుండంగా మారే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది పశ్చిమ-ఉత్తర దిశగా మరింత కదులుతూ, రాబోయే 48గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దీంతోపాటు పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. గత మూడ్రోజులుగా సింగిల్ డిజిట్‌కు పరిమితమైన ఉష్ణోగ్రతలు.. రెండురోజుల నుంచి స్వల్పంగా పెరిగినట్టు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో 15 డిగ్రీలలోపు రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొన్నది. అత్యల్పంగా రాత్రి ఉష్ణోగ్రతలు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 11.6 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది.