వెంగళరావునగర్, అక్టోబర్ 7: బీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై తాజాగా మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే ఇది 26వ కేసు కావడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బీఆర్ఎస్ సోషల్‌మీడియా నాయకులపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నదనే దానికి ఇది నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ప్రకటించే 48గంటల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హుటాహుటిన 2500 గజాల భూమిని అలాపురి కాలనీలో ముస్లింల శ్మశాన వాటిక కోసం కేటాయించింది. అయితే ఆర్మీ అధికారులు ఆ భూమి రక్షణశాఖదని ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసం చేసిన డ్రామా అని సోషల్ మీడియా వేదికగా మన్నె క్రిశాంక్ ప్రశ్నించగా.. కాంగ్రెస్ నాయకులు దానిని తప్పుబడుతూ మంగళవారం బోరబండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై మన్నె క్రిశాంక్ స్పందిస్తూ.. కక్షపూరితంగా పోలీసులే ఫిర్యాదును తయారు చేశారని క్రిశాంక్ ఎక్స్‌లో ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓయూలో జరిగిన కేసులు, కొట్టివేసిన కేసులను కూడా జతపరిచి.. రౌడీషీట్ తెరిచే కుట్రలు పన్నుతున్నారని ఆయన అనుమానించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.