Paddy Procurement | హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లపై మరో పిడుగు పడనున్నది. ప్రభుత్వంపై రైస్‌మిల్లర్లు సహాయ నిరాకరణకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తున్నది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సీఎమ్మార్‌లో భాగస్వామ్యం కావొద్దని భావిస్తున్నారు. ఈ మేరకు యాసంగి ధాన్యాన్ని దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వానికి లేఖ ఇవ్వనున్నట్టు మిల్లర్లు తెలిపారు. ముఖ్యంగా రా రైస్ మిల్లర్లు ప్రభుత్వంపై మరింత ఆగ్రహంతో ఉన్నారు. యాసంగిలో రా రైస్ చేయడం సాధ్యంకాదని చెప్పినా వినిపించుకోవడం లేదని, తమ పీకలపై కత్తిపెట్టి మరీ ధాన్యం దించుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
యాసంగి ధాన్యంలో రైస్ అవుట్ టర్న్ రేషియో తేల్చాలనే తమ డిమాండ్‌ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వ మొండి వైఖరితో తమకు నష్టాలు తప్పవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ధాన్యం దించుకుంటే నష్టపోయే ప్రమాదం ఉన్నదని, ఒకవేళ దించుకోకపోతే విజిలెన్స్ దాడుల పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తున్నారని దిగులు చెందుతున్నారు. మహిళా సంఘాలతో రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఓ మిల్లర్ స్పందిస్తూ.. వారితోనే మిల్లింగ్ చేసుకోవాలని, అలాంటప్పుడు ధాన్యం దించుకోవాలని తమపై ఒత్తిడి ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సర్కారుతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. ఈ యాసంగి ధాన్యం మాత్రం దించుకునేదే లేదని తేల్చి చెప్తున్నట్టుగా తెలిసింది.
సాధారణంగా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏ సీజన్లో అయినా మిల్లర్లతో సివిల్ సైప్లె కార్పొరేషన్ సమావేశం నిర్వహించి చర్చిస్తుంది. ఆ తర్వాత జిల్లాల వారీగా మిల్లర్లతో ఒప్పందాలు చేసుకుంటుంది. కానీ ఇప్పటివరకు ఇవేవీ కాలేదని మిల్లర్లు తెలిపారు. రాష్ట్ర సంఘంతో సివిల్ సైప్లె ఇప్పటివరకు సమావేశం నిర్వహించనేలేదని తెలిపారు. దీంతోపాటు జిల్లాల్లో మిల్లర్లతో ఒప్పందాలు జరగలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎవరు దించుకుంటారో తెలియని పరిస్థితి నెలకొన్నది. నిరుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మిల్లర్లతో ఒప్పందాలు ఆలస్యంకావడంతో ధాన్యం ఎక్కడ దించాలనే దానిపై స్పష్టత కరువైంది. ఈ ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడింది.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు మాత్రం నెమ్మదిగా నిర్వహించారు. కోటి టన్నుల ధాన్యం లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు 50 లక్షల టన్నులతో సరిపెట్టారు. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా ఇదే జరిగే పరిస్థితి కనిపిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీజన్లో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 50 లక్షల వరకే పరిమితం కావాలని అంతర్గతంగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే కొనుగోళ్లలో ఆలస్యం కోసమే మిల్లర్లతో సమావేశాలు నిర్వహించకపోవడం, ఒప్పందాలు చేసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.