నర్సింహులపేట, మార్చి 25: ఉపాధి లేక.. అప్పుల బాధ భరించలేక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడుపుల గ్రామంలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వంతడుపుల గ్రామానికి చెందిన ఎర్పుల శ్రీను (35) కొన్నేళ్లుగా ఫైనాన్స్‌లో ఆటో కొనుక్కుని ఖమ్మంలో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఫైనాన్స్‌లో డబ్బులు చెల్లించక పోవడంతోపాటు కుమార్తె ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. కిస్తీలు కట్టకపోవడంతో ఫైనాన్స్ వాళ్లు ఆటో తీసుకెళ్లారు. అప్పటికీ ఆటో డబ్బులు ఇంకా చెల్లించాల్సి ఉన్నదని ఫైనాన్స్ వాళ్లు నోటీసులు పంపించారు. ఉన్న డబ్బులు కుమార్తె వైద్యం కోసం ఖర్చు చేశాడు. కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆ డబ్బులు సరిపోకపోవడం, అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీను అత్తగారి ఊరు పడమటిగూడెం నుంచి మంగళవారం తెల్లవారుజామున వంతడుపుల గ్రామానికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేశ్ తెలిపారు.
పత్తి రైతు బలవన్మరణం ;వికారాబాద్ జిల్లాలో ఘటన
వికారాబాద్, మార్చి 25 : దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో వికారాబాద్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌పేట మండలం అమ్రాది కలాన్ గ్రామానికి చెందిన ఈర్లపల్లి కుమార్ (42) కు ఎకరం 15 గుంటల భూమి ఉన్నది. ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గత జూన్‌లో పత్తి సాగు చేశాడు. అధిక వర్షాల వల్ల పంట పూర్తిగా పాడైపోయింది. కుటుంబం అవసరాల కోసం కూడా అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక రోజూ మనోవేదనకు గురై ఆదివారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ప్రైవేటు దవాఖానకు తరలించగా..వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు. కుమార్ భార్య యాదమ్మ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు మోమిన్‌పేట ఎస్సై తెలిపారు.