హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): పాలిటెక్నిక్ తుది విడత కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత మరో 8,748 సీట్లు భర్తీకాకుండా మిగిలాయి. ప్రైవేట్ కాలేజీలతో పోల్చితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లోనే అత్యధిక సీట్లు భర్తీకావడం విశేషం. ప్రభుత్వ కాలేజీల్లో 13వేలకు సీట్లుంటే 11వేల సీట్లు భర్తీకాగా, ప్రైవేట్ కాలేజీల్లో 15వేల సీట్లుంటే 9వేలకు పైగా సీట్లు మాత్రమే భర్తీ అయ్యా యి. రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్లు, ఒక ప్రైవేట్ కాలేజీలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి.
పాలిటెక్నిక్ తుది విడత సీట్లను శుక్రవారం కేటాయించగా, రెండు విడతల్లో మొత్తంగా 29, 610సీట్లకు, 20,862 (70.46%) సీట్లు భర్తీ అయ్యా యి. సీట్లు పొందిన విద్యార్థులు 15లోగా ఫీజు చెల్లించాలని, 16లోగా కాలేజీల్లో రిపోర్ట్చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. కోర్సుల వారీగా తీసుకుంటే సీఎస్ఈలో 82% సీట్లు భర్తీకాగా, ఆ తర్వాత ఈసీఈలో 80% చొప్పున భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్ ఫస్టియర్ క్లాసులు 18 నుంచి ప్రారంభంకానున్నాయి. 15, 16 తేదీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్ను నిర్వహించి, 18 నుంచి మొదటి సెమిస్టర్ క్లాసులను ప్రారంభిస్తారు.