హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : టీజీఎస్ఆర్టీసీ ఈ సంవత్సరం ప్రథమార్ధంలో హైదరాబాద్‌లో మరో 286 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. మే నాటికి డిమాం డ్ ఉన్న మార్గాల్లో ఈ బస్సులను అందుబాటులోకి తేనున్నది. ప్రస్తుతం నగరంలో సగటున 80 శాతం ఆక్యుపెన్సీతో 254 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. దశలవారీగా డీజిల్ బస్సుల సంఖ్యను తగ్గించి 2,500 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్టీసీ.. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నది.
వచ్చే మూడు నెలల్లో రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఈవీ చార్జింగ్ పాయింట్‌ను ప్రారంభించి అకడి నుంచి సుమారు 100 ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. కూకట్పల్లి బస్ డిపో నుంచి మరో 100 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, ప్రస్తుతం నగరంలో 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు, 74 ఎలక్ట్రిక్ సిటీ ఆర్డినరీ, 90 ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్, జనవరి 23(నమస్తే తెలంగాణ): యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నాలుగు కోర్సుల్లో ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఎండోస్కోపీ టెక్నీషియన్(ఏఐజీ దవాఖాన) ఈక్యూయుఐపీపీ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్సీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ కన్సార్షియం), సప్లయ్ చైన్ ఎసెన్షియల్స్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం(ఓ9 సొల్యూషన్స్), మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్(కిమ్స్ దవాఖాన) కోర్సులను ఆఫర్ చేస్తున్నారు. ఈ నెల 30న ప్రవేశాల ప్రక్రియ ముగియనున్నదని, ఫిబ్రవరి మొదటి వారం నుంచి శిక్షణ ప్రారంభంకానున్నట్టు వర్సిటీ వర్గాలు తెలిపాయి.