సంగారెడ్డి : రాష్ట్రంలో మరో పదిలక్షల కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. అలాగే సొంత జాగ ఉంటే ఇంటి నిర్మాణానికి తెలిపారు. సంగారెడ్డిలో మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి, అభయహస్తం కార్పస్ ఫండ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల క్రితం మహిళా సంఘాల సభ్యులు రూ.500 పింఛన్ కోసం కట్టారనీ, ఇప్పుడు వడ్డీతో కార్పస్‌ఫండ్ కలిపి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.545 కోట్లు తిరిగి ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రూ.200 పింఛన్‌ను పెంచి రూ.2016 ఇస్తున్నారన్నారు.
సంగారెడ్డి జిల్లా బ్యాంక్ లింకేజీ తెలంగాణలోనే నంబర్ వన్ అన్నారు. సంగారెడ్డిలో రూ.672 కోట్ల బ్యాంక్ లింకేజీ ఇచ్చామన్నారు. రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీలు ఏర్పాటు చేసి బాలికలకు సీఎం కేసీఆర్ చదువు చెబుతున్నారన్నారు. కల్యాణలక్ష్మితో పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి సురక్షితమైన తాగునీటిని అందించిన ఘనత కేసీఆదే అన్నారు. దేశమంతటా కరెంటు కోతలున్నాయని, కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. కొందరు యాత్రల పేరిట మాయమాటలు చెబుతూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
బండి సంజయ్ బీజేపీ పాలిత కర్నాటకలో రూ.2000 పింఛన్ ఇప్పించి పాదయాత్ర చేయాలన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. పైరవీకారుల ప్రమేయం, లంచాలు లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రూ.400 ఉన్న సిలిండర్ ఇప్పుడు రూ.1050 అయ్యిందన్నారు. మహిళల దెబ్బ మోదీకి తెలియాలని, ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్, నూనె ధరలను పెంచుతూ పేదలపై భారం మోపుతోందని మండిపడ్డారు.