హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : రోజువారీ ఖర్చులకు ఏడాదిలో 365 రోజులకుగాను 363 రోజులు గత ఏడాది ఆర్బీఐ వద్ద చేబదులుగా అప్పు తీసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఈ నెలలో 7న రూ.3,900 కోట్లు అప్పు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.3000 కోట్ల రుణ సమీకరణకు ప్రతిపాదనలు పంపించింది. 7, 11, 21 ఏండ్ల కాలాలకు రూ.1000 కోట్ల చొప్పున ప్రభుత్వ సెక్యూరిటీల ద్వారా ఈ నెల 21వ తేదీన (మంగళవారం) ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని ఈ మొత్తం తీసుకుంటామని శుక్రవారం ఇండెంట్ పెట్టింది.
ఈ తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేస్తామని ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థికశాఖ ఇండెంట్ సమర్పించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఆర్బీఐ నుంచే ఓపెన్ మార్కెట్ రుణాలుగా ప్రభుత్వం రూ.85,840 కోట్లు అప్పు తీసుకున్నది. గత ఏడాది బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణ రూ.54.009 కోట్లు ప్రతిపాదించిన రేవంత్రెడ్డి సర్కార్.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.85,840 కోట్లు.. అంటే 158.93 శాతం అప్పు తీసుకున్నది. 2026-27లో 80,000 కోట్ల రుణ సమీకరణ చేస్తామని తాజా బడ్జెట్లో ప్రతిపాదించారు.