హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేశాయి. ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) అలకబూనారు. ఆయనను బుజ్జగించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా అంజన్ కుమార్తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను సంప్రదించకుండా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 ఏండ్లుగా పార్టీలో ఉన్నానని, తనను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రమే లోకల్, నాన్ లోకల్ సమస్య ఎందుకు వచ్చిందని వారిని ప్రశ్నించారు. గతంలో ఒకాయన కామారెడ్డిలో, మల్కాజ్గిరిలో పోటీ చేసినప్పుడు ఇది గుర్తుకు రాలేదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వారిని నిలదీశారు. కష్టకాలంలోనూ కాంగ్రెస్లో ఉన్నానని, పార్టీ కోసం పని చేశానని మండిపడ్డారు. తనకు టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలో చెబుతానని అన్నారు. కనీసం జూబ్లీహిల్స్ కమిటీలో కూడా తనను తీసుకోలేదని వాపోయారు. వాళ్లు తమను తొక్కుకుంటూ పోతే, తాము ఎక్కుకుంటూ పోతామని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్నని, ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు కనీసం నన్ను సంప్రదించారా అని వారిని నిలదీశారు. కార్యకర్తలతో భేటీ తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.