HCU | శేరిలింగంపల్లి, మార్చి 4: హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలిలో ప్రశాంతంగా బతికిన మూగజీవాలు నేడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. చెట్లను, ఆవాసాలను బుల్డోజర్లు నేలమట్టం చేస్తుంటే బెదిరిన జింకలు గమ్యం ఎటో తెలియకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో జింకలు సంచరిస్తూ కనిపిస్తున్నాయి. శుక్రవారం గోపన్‌పల్లి, ఎన్టీఆర్ నగర్లో ఓ జింక హృదయవిదారకంగా తిరుగుతూ కనిపించింది. రహదారిపై ఉన్న పలు షాపుల్లోకి వెళ్తూ, బయటకు వస్తూ భయపడుతూ కనిపించింది. ఎన్టీఆర్ నగర్ ప్రధాన రహదారిపై పరుగెత్తగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. స్థానికులు జింకను కుక్కల బారినుంచి కాపాడారు.
ఆ తర్వాత జింక కనిపించిన ఇంట్లోకి వెళ్తూ, అక్కడి మనుషులను చూసి బెదిరిపోతూ బయటకు వచ్చింది. చివరికి ప్రహారీ గేటు లాక్ వేసి ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి గోడదూకి వెళ్లింది. కుక్కలు లోపలికి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో జింక చాలాసేపు ప్రశాంతంగా అక్కడే తలదాచుకుంది. జింకను చూసేందుకు చాలామంది స్థానికులు అక్కడ గుమిగూడారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీసులు, అటవీశాఖ అధికారులు, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ ప్రతినిధులు జింకను నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. జింక కొమ్ముకు స్వల్ప గాయమైందని, రెండు రోజులు చికిత్స అందించి జూపార్క్‌లో వదిలిపెడుతామని అటవీశాఖ అధికారులు చెప్పారు.