Paddy Procurement | నర్సింహులపేట, మే 5 : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో నెల రోజులుగా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లు తేమ శాతం వచ్చినా కాంటాలు పెట్టడం లేదని రైతులు మండిపడ్డారు. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నామని, కనీసం తాగునీళ్లు సమకూర్చడం లేదని సోమవారం సీనియర్ ఇన్స్పెక్టర్ యాకూబ్ అలీని నిలదీశారు. చిన్న రైతులను చిన్నచూపు చూస్తూ, పెద్ద రైతుల వడ్లు కాంటాలు పెడుతున్నారని మండిపడ్డారు. హమాలీలు తక్కువగా ఉండటంతో కాంటాలు ఆలస్యం అవుతున్నాయని, వారి సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.
నీళ్లు మేమే తెచ్చుకుంటున్నం..
కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు కాంటాలు కాక తిప్పలు పడుతున్నం. వడ్లు తేమ వచ్చిందని చెప్పి 10 రోజులు దాటింది. ఇప్పటిదాక కాంటా పెట్టలే. నిలబడేందుకు నీడ లేదు. మంచినీళ్లు పెడుతలేరు. మేమే రూ.50 పెట్టి నీళ్లు కొనుక్కుంటున్నం. సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలి. రోజుల కొద్దీ ఇక్కడికి వచ్చి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నం.- భూక్యా రోజా, రైతు, పిచ్చిరాం తండా, మం: నర్సింహులపేట
సింగాయపల్లిలో రైతుల వంటావార్పు ; ఆంక్షలు లేకుండా ధాన్యం కొనాలని డిమాండ్
గోపాల్పేట, మే 5 : ఆంక్షలు లేకుండా ధాన్యం కొనాలని వనపర్తి జిల్లా ఏదుల మండలం సింగాయపల్లి రైతులు డిమాండ్ చేశారు. సోమవారం రోడ్డుపై వంటావార్పుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరి కోతలు ప్రారంభమై నెల కావస్తున్నా ఆలస్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారని ఆరోపించారు. ఇప్పటి వరకు కేవలం రెండు లారీల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, ఆ లారీల ధాన్యాన్ని దింపకుండా తాలు ఉన్నదని రైస్ మిల్లరు మొండికేయడం సరికాదన్నారు. వడ్లను తూర్పారాబట్టాలని షరతులు పెట్టడంపై మండిపడ్డారు. ఏపీఎం పార్వతమ్మ హామీతో రైతులు ఆందోళన విరమించారు.