గజ్వేల్, సెప్టెంబర్ 9: కేసీఆర్ నివాసాన్ని ముట్టడించేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ నాయకుల తీరుపై గ్రామాల్లో ఆగ్రహం పెల్లుబుకింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని మర్కూక్, ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, బావానందపూర్, గంగాపూర్ గ్రామాల్లో బుధవారం గ్రామస్తులు, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలతో ప్రధాన చౌరస్తాల వరకు ర్యాలీగా వెళ్లి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే తమ గ్రామాలు అభివృద్ధి చెందాయని, కాంగ్రెస్ వచ్చిన రెండున్నరేండ్లలో ఎక్కడా అభివృద్ధి పనులు చేపట్టడం లేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు రక్షణ కవచంలా నిలబడి కేసీఆర్ నివాస ముట్టడికి ర్యాలీని అనుమతించడం ఏందని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన 420 హామీలను అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దాటవేస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పదేండ్లలో గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధిలో 30ఏండ్లు ముందుకెళ్తే కాంగ్రెస్ మాత్రం అభివృద్ధిని నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. ఇక్కడి నుంచి ఉమ్మడి నల్లగొండతోపాటు సంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు కేసీఆర్ సాగు, తాగు నీటిని అందించారని కొనియాడారు.