హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నిత్యం ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలకు అక్షరాలు నేర్పించడం, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తున్నది. సెంటర్ల నిర్వహణలో కీలకమైన ఆయాల పోస్టులను భర్తీ చేయడంలో తాత్సారం చేస్తున్నది. తద్వారా అంగన్వాడీ టీచర్లపై భారం పడుతున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్, లోకల్ ఏరియాల్లో 35,700 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 7, 834 సెంటర్లలో ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం అంగన్వాడీ టీచర్లతోనే సెంటర్లను నెట్టుకొస్తున్నారు. వీరే పిల్లల ఆలనాపాలన చూస్తూ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందజేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఇక మారుమూల ప్రాంతాల్లోని సెంటర్లలో పనిచేస్తున్న టీచర్ల కష్టాలు వర్ణనాతీతం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 13,650 ఉన్న టీచర్ల వేతనాలను రూ. 18,000కు పెంచుతామని ఇచ్చిన హామీని పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
రాష్ట్రంలోని 3, 989 మినీ అంగన్వాడీ సెంటర్లను ప్రభుత్వం రెండు నెలల కిందట మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసింది. అయితే ఈ సెంటర్లకు హెల్పర్ పోస్టులను మంజూరు చేసింది. కానీ ఒక్క కేంద్రంలో కూడా నియమించలేదు. దీంతో టీచర్లే సెంటర్ల నిర్వహణను నెట్టుకొస్తున్నారు. అప్గ్రేడ్ కావడంతో పనిభారం పెరిగిందని చెబుతున్నారు. హెల్పర్లు లేని అంగన్వాడీ సెంటర్లలో చిన్నారుల ఎన్రోల్మెంట్ గణనీయంగా తగ్గిపోతున్నది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. ఇచ్చోడ లాంటి మండలాల్లోనైతే పిల్లల నమోదు శాతం జీరోగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.
65 ఏళ్లు నిండిన టీచర్లు, హెల్పర్లను విరమణ చేయిస్తున్న ప్రభుత్వం ఖాళీలను మాత్రం భర్తీ చేయడంలేదు. దీంతో నెలనెలా వందల సంఖ్యలో పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటివరకు 6,399 టీచర్, 7834 మంది హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే గత మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఆరు నెలలవుతున్నా పట్టించుకోవడంలేదు. కొంత కాలం ఎస్సీ వర్గీకరణను సాకుగా చూపి వాయిదా వేస్తూ వచ్చింది. ఈ సమస్య పరిష్కారమై సుమారు రెండు నెలలు గడిచినా ఖాళీల భర్తీపై ఊసే ఎత్తడంలేదు.
రెండు నెలల క్రితం ప్రభుత్వం మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేసింది. కేవలం వేతనం మాత్రమే పెంచింది. అయితే హెల్పర్లను నియమించలేదు. దీంతో లబ్ధిదారుల వివరాల ఆన్లైన్ నమోదు, పౌష్టికాహారం పంపిణీ ఇతరత్రా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే భర్తీ చేస్తామని చెబుతున్నారు కానీ నోటిఫికేషన్ విడుదలపై స్పష్టత ఇవ్వడంలేదు. సాధ్యమైనంత తొందరలో నోటిఫికేషన్ ఇచ్చి ఆయాలను నియమించాలి.