కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 25: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే పుడమిపై పంజా విసురుతున్నాడు. మరో నెలన్నర దాకా వదిలిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల చేరువకు చేరాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తుతూ ఉదయం 10 గంటల నుంచి ఇళ్లకే పరిమితమవుతున్నారు. విద్యార్థులకు పరీక్షలు కూడా ముగియగా, ప్రభుత్వం వేసవి సెలవులు కూడా ప్రకటించింది. కానీ, అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centers) మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నడుస్తున్నాయి. వీటిలోకి వచ్చే చిన్నా రులు, బాలింతలు, గర్భిణులకు వేసవిలో అందించాల్సిన కనీస సౌకర్యాలు కరువవగా, వారంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రధానంగా పూర్వ ప్రాథమిక విద్య కోసం కేంద్రాల్లోకి వచ్చే చిన్నారుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఉదయం హుషారుగా వస్తున్న వారంతా మధ్యాహ్నం వరకు తోటకూర కాడలా వాడిపోతున్నారు. విశాలమైన గదిలో మంచినీటి వసతితో పాటు గాలి కోసం ఫ్యాన్ కూడా విధిగా కేంద్రాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే అధికారుల పట్టింపు లేనితనం, సిబ్బంది నిర్లక్ష్యం వెరసి జిల్లాలోని అనేక కేంద్రాల్లో ఈ సౌకర్యాలు కొరవడ్డాయనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు పంపడం లేదు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి కూలీ, నాలీ చేసుకునే వారికి మాత్రం పంపక తప్పని పరిస్థితి. అలాగే పౌష్టికాహారం కోసం గర్భిణులు, బాలింతలు కూడా కేంద్రాలకు విధిగా వెళ్లాల్సి ఉండగా, వారి పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. జిల్లాలో మొత్తం 777 కేంద్రాలు ఉండగా, వీటి ద్వారా 9650 మంది చిన్నారులు, 3620 మంది గర్భిణీలు, 4000 మంది బాలింతలు సేవలు పొందుతున్నారు. వీరందరి కోసం జిల్లాలో 307 సొంత భవనాలు మాత్రమే ఉండగా, అద్దె పవనాలు 211, ఇతర భవనాల్లో 119 కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటిలో విద్యుత్ సరఫరా లేని కేంద్రాలు 125 వరకు ఉండగా, విద్యుత్తు ఉన్న ఫ్యాన్లు లేని కేంద్రాలు 100 వరకు ఉన్నట్లు అంగన్వాడి వర్గాల ద్వారా తెలుస్తుంది.
గతేడాది నుంచి మార్చిలొనే ఎండలు మండుతుండగా, కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై అటు నిర్వాహకులు, ఇటు చిన్నారులు, బాలింతలు, గర్భిణీల నుంచి తీవ్ర అసహనం వ్యక్తం అవుతోంది. కొన్నిచోట్ల కేంద్రాలకు సమీపంలో చెట్ల కింద చిన్నారులకు చదువులు చెబుతుండగా, విధిలేని చోట మాత్రం చీకటి గదుల్లో ఉక్కపోతతోనే నెట్టుకొస్తున్నారు. దాంతో, చాలా కేంద్రాల్లో చిన్నారులు, లబ్ధిదారుల హాజరుశాతం తగ్గుతుంది. ఉదయం 8 గంటలకు కేంద్రాలు తెరుస్తున్నప్పటికీ రావడానికి వెనుకాడుతున్నట్లు కేంద్రాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. కేంద్రాలకు రావాలని ఒత్తిడి చేసి సిబ్బంది తీసుకెళ్తున్నా గదుల్లో వేడికి చిన్నారులు తట్టుకోలేక పలు చోట్ల అస్వస్థతకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ పిల్లలను పంపేందుకు పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. ఫలితంగా కనీస సౌకర్యాలు లేని సెంటర్లన్నీ లబ్ధిదారులు లేక బోసిపోతున్నాయి. తద్వారా కొన్ని కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి ద్వారా భోజనాన్ని వండిపెట్టడం లేదు. మరికొన్ని చోట్ల భోజనం వండిపెడితే బాక్సుల ద్వారా ఇంటికి తీసుకెళ్తున్నారు. మునుముందు కూడా ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని, లబ్ధిదారుల ఇంటికే సరుకులు అందించాలనే డిమాండ్ పెరుగుతున్నది.
అవసరమైన చర్యలకు ప్రతిపాదనలు పంపాం..
జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న క్రమంలో, కేంద్రాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రతిపాదనలు పంపామని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు కేంద్రాలను నడిపిస్తున్నాం. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ఉదయం పూట ఆటపాటలతో చదువు చెప్పి భోజనం పెట్టిన అనంతరం ఇంటికి పంపించేలా చూస్తున్నాం.