హైదరాబాద్ జూలై 6 (నమస్తేతెలంగాణ): ‘అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సకల హంగులతో కొత్త భవనాలు నిర్మిస్తాం’ అంటూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు దాటినా పక్కా భవనాల నిర్మాణానికి అడుగు పడిందిలేదు. నిధులు మంజూరు చేసిందీ లేదు. ఆరు నెలలుగా కనీసం అద్దె కూడా చెల్లించడం లేదు. దీంతో ఖాళీ చేయాలని యాజమానులు ఒత్తిడి తెస్తుండటంతో అంగన్వాడీ టీచర్లపైనే అద్దె భారం పడుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
ఇందులో 11,483 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 2,000 భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నేతలే చెప్తున్నారు. 11,690 కేంద్రాలను ప్రభుత్వ భవనాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తుండటంతో వీటికి అద్దె భారం తప్పింది. ఇవి పోను 12,248 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. లబ్ధిదారులు లేక 269 కేం ద్రాల్లో తాత్కాలిక సేవలను నిలిపివేయడంతో మూతపడ్డాయి. సమస్యను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రా లు సమర్పించినా పట్టించుకోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2022లో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు మెట్రోపాలిటన్ నగరాల్లో అయితే రూ.8వేలు, మున్సిపాలిటీల్లో రూ.6వేలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రూ.2వేల కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నెలలుగా ఆ కిరాయిలే చెల్లించడంలేదు. రాష్ట్రవ్యాప్తంగా కిరాయి భవనాల్లో కొనసాగుతున్న 12,248 సెంటర్లకు 6 నెలలుకు సుమారు రూ.50 కోట్లు పెండింగ్లో ఉన్నాయి.