హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను (Anganwadi Center ) కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణాలోపం, కేంద్రాల్లో కనీస వసతులు లేక దయనీయంగా మారాయి. సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యతోపాటు, పిల్లలు, బాలింతలు, గర్భిణులకు సక్రమంగా పౌష్టికాహారం అందటం లేదు. ఈ క్రమంలో ‘సాక్షం అంగన్వాడీ పోషణ్ 2.0’ నివేదిక ద్వారా తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ఆందోళనకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలలోని పలు అంశాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని అధిక సెంటర్లలో వసతులలేమి కొట్టుచ్చినట్టుగా కనిపిస్తున్నది. ముఖ్యంగా మారుమూల జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని తేటతెల్లమైంది.
కేంద్రం నిర్దేశించిన ప్రకారం ఉదయం 9గంటలకు అంగన్వాడీ సెంటర్లను విధిగా తెరువాల్సి ఉంటుంది. కానీ జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో 11గంటల తర్వాతే ఓపెన్ చేస్తున్నట్టు అంగన్వాడీ పోషణ్ 2.0లో గుర్తించారు. పర్యవేక్షణలేకపోవడం, టీచర్లు, ఆయాల కొరతనే ఇందుకు కారణమని తెలుస్తున్నది. మిషన్ వాత్సల్యలో భాగంగా తెలంగాణ లోని చైల్డ్ ప్రొటెక్షన్ సెంటర్లను ప్రతివారం డీడబ్ల్యూవో, సీడీపీవో, అంగన్వాడీ సూపర్ వైజర్ సందర్శించి కార్యక్రమాల అమలు, చిన్నారుల హాజరుశాతం, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పోషకాహారం సరఫరాను పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లోని సెంటర్లను అధికారులు సందర్శించడం లేదు. అలాగే ఒక్కో టీచర్‌కు రెండు, మూడు సెంటర్ల బాధ్యతలు అప్పగించడంతో పనిభారం పెరగడంతో మెరుగైన సేవలందించడం సాధ్యం కావడం లేదని తెలుస్తున్నది.
రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, ఆయా సెంటర్లకు సక్రమంగా కోడిగుడ్లు, పోషకాహారం(బాలామృతం) సరఫరా జరగడంలేదు. 341 సెంటర్లలో 32% మాత్రమే కోడిగుడ్లు అందాయి అని నివేదికలో తేలింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పప్పు ధాన్యాలు సరఫరా కేవలం 28% మాత్రమే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. నివేదికలోని అంశాల ప్రకారం జోగులాంబ, గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో పప్పు ధాన్యాల సరఫరా ఇప్పటివరకు ప్రారంభంకాలేదని తెలుస్తున్నది. ప్రభుత్వం పప్పులు, మంచినూనె, ఇంధన ఖర్చుల కోసం రూ. 96,50,38,121 కేటాయించింది. కానీ హైదరాబాద్, కుమ్రంభీం, నిజామాబాద్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో వెచ్చించిన నిధులు ఖర్చు చేయలేదు. ఆయా జిల్లాల్లోని కలెక్టర్లు, అధికారుల వైఫల్యమే ఇందుకు కారణమని బట్టబయలైంది. అలాగే మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 153 సెంటర్లలో జీరో ఎన్రోల్మెంట్ ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఇక్కడి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.