హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వెయ్యి ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం అంగన్వాడీ కేంద్రాలకు శరాఘాతంగా మారనున్నది. సర్కారు అసంబద్ధ విధానంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంకానున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. మూడేండ్లు నిండిన చిన్నారులకు ఎన్నో ఏండ్ల నుంచి అక్షరాలు దిద్దించడంతోపాటు పౌష్టికాహారం అందజేస్తున్న అంగన్వాడీ కేంద్రాలు భవిష్యత్‌లో కనుమరుగయ్యే ప్రమాదమున్నదని అంగన్వాడీ యూనియన్ల నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ ముందుచూపు లేని వైఖరితో సుమారు 70 వేల మంది టీచర్లు, ఆయాల బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఎన్రోల్మెంట్ పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం 2025-26 విద్యాసంవత్సరంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఏర్పాటుచేశారు. నాలుగేండ్లు నిండిన పిల్లలకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించారు. ఒక ఉపాధ్యాయురాలితో పాటు ఆయాను నియమించారు. ఒక్కో సెంటర్ నిర్వహణకు ఏటా రూ.2.10 లక్షలు కేటాయించారు. టీచర్‌కు రూ.8 వేలు, హెల్పర్‌కు రూ. 6 వేల చొప్పున వేతనాలు ఇస్తున్నారు. సర్కారు నిర్ణయంతో అంగన్వాడీలు వెలవెలబోయే అవకాశం ఉన్నదని, భవిష్యత్‌లో మూతపడే ప్రమాదమూ అంగన్వాడీ యూనియన్ల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
చిన్నారులు, మహిళలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో ఐసీడీఎస్‌లను బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకాలం చిన్నారుల సంరక్షణ, వారికి చదువు చెప్పేందుకు అంగన్వాడీలను నిర్వహిస్తున్నారు. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ సెంటర్లలో కొత్తగా ఎన్రోల్మెంట్ చేపట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలనే చేర్పించడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ప్రశ్నిస్తున్నారు. సర్కారు ముందుచూపు లేని నిర్ణయంతో ఐసీడీఎస్‌లు నిర్వీరమయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రీప్రైమరీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను తమకే అప్పగించాలని అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు. వారికిచ్చే వేతనాలను తమకిస్తే ఆశించినమేర ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ప్రీప్రైమరీ సెంటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అనేకసార్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు, మంత్రులకు విజ్ఞప్తి చేసినట్టు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల నాయకులు వెల్లడించారు. అయినా తమ వినతులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో పోరాటమే శరణ్యమని చెబుతున్నారు. త్వరలోనే ఉద్యమానికి కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు.