హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ విస్తరణపై ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నది. గుట్టుగా పనులు కొనసాగిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తర్వాత కొత్త ప్రాజెక్టు చేపట్టాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ సర్కార్ శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే రాయలసీమ ఎత్తిపోతల, 80వేల క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ (పీఆర్పీ) విస్తరణకు పూనుకున్నది.
రూ.6,829.15 కోట్లతో పనులు చేపట్టేందుకు 203 జీవోను ఏపీ సర్కార్ గతంలోనే జారీ చేసింది. అందులో భాగంగా రాయలసీమ లిఫ్ట్ పనులతో పాటుగా, పీఆర్పీ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీ వరకు గల 44వేల క్యూసెక్కుల సామర్థ్యమున్న ఎస్ఆర్ఎంసీ (శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్)ను సిమెంట్ లైనింగ్ చేపట్టడం ద్వారా 89,762 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించింది.
రాయలసీమ లిఫ్ట్‌ను వ్యతిరేకిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో సవాల్ చేయడం, దానిపై విచారణ చేపట్టి పనులపై స్టే విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏపీ తన తీరును మార్చుకోలేదు. ఎన్జీటీ ఆదేశాలను సైతం ధిక్కరించి కొద్దిరోజులుగా ఎస్ఆర్ఎంసీ లైనింగ్ పనులను కొనసాగిస్తుండటం గమనార్హం. అదీగాక గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలకు సైతం లైనింగ్ పనులను నిర్వహిస్తున్నది. దీనిపై రేవంత్ సర్కార్ ఇప్పటికీ నోరు మెదపడం లేదు.