హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదీ జలాలకు సంబంధించిన కోటాలో ఆంధ్రప్రదేశ్ 74% నీళ్లను వాడుకున్నట్టు కేఆర్ఎంబీ ధ్రువీకరించిందని, కానీ, తెలంగాణ ప్రభుత్వం 24% నీటిని కూడా వాడుకోవడం లేదని మాజీ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం మరోసారి బయటపడిందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాల్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంతకాలం బీఆర్ఎస్ చేస్తున్న వాదనను కేఆర్ఎంబీ రుజువు చేసిందని స్పష్టంచేశారు. బీఆర్ఎస్ హెచ్చరించిన తర్వాత కూడా ఏపీ 65 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకున్నదని మండిపడ్డారు. ఏపీ జలదోపిడీపై ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చేతకాని దద్దమ్మల్లా ఏపీ సీఎం చంద్రబాబు బూట్లు నాకుతున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ జలదోపిడీకి పాల్పడుతుంటే, కృష్ణా పరీవాహక ప్రాంత జిల్లాలకు చెందిన మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని, తమ మూతులకు ప్లాస్టర్లు వేసుకున్నారా? అని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కమీషన్లు దండుకోవడానికి సీఎం, మంత్రులు ప్రాధాన్యమిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలకు ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాగునీటికి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉన్నా మంత్రులు ఎందుకు సమీక్షలు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ హయాంలో 38 శాతానికిపైగా కృష్ణా జలాలను వాడుకున్నామని వివరించారు. తెలంగాణ హకులపై సోయి లేకుండా వ్యవహరిస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు.
సాగునీరు, తాగునీటి సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కావాలని జగదీశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ చేతికి వెళ్తే ఎంత ప్రమాదమో.. తాము గతంలో చేసిన హెచ్చరికలు ఇప్పుడు నిజమయ్యాయని పేర్కొన్నారు. దీనిపై ముందే హెచ్చరించినా, పట్టించుకోకుండా కృష్ణ జలాలను ఆంధ్రా పాలుచేశారని కాంగ్రెస్ సర్కారు వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణకు ద్రోహం చేసిన సీఎం, మంత్రులు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారో చెప్పాలని నిలదీశారు. కృష్ణా జలాలను తెలంగాణకు దక్కించుకునేందుకు కేసీఆర్ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.