హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇదే అదనుగా భావించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును పోలీసు బలగాల అండతో అర్ధరాత్రి వేళ ఆక్రమించింది. కుడి కాలువ హెడ్‌రెగ్యులేటరీని స్వాధీనం చేసుకున్నది. నిర్వహణ మొత్తాన్ని చూసుకుంటామన్నది. అటువైపు తెలంగాణ ఇంజినీర్లను అనుమతించేందుకు మోకాలడ్డింది. నదీ యాజమాన్య బోర్డుకు సైతం ఫిర్యాదులు చేసింది. తీరా ఇప్పుడు మరమ్మతుల విషయానికి వచ్చేసరికి తెలంగాణ సరిగా నిర్వహించడం లేదంటూ సాకులు చెప్తున్నది. ఈ మేరకు తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు లేఖ రాసింది. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ నోరుమెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి, రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుదిరిన తాత్కాలిక ఒప్పందం మేరకు నాగార్జునసాగర్ డ్యామ్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం.. శ్రీశైలం డ్యామ్ నిర్వహణ, మెయింటనెన్స్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడాల్సి ఉన్నది. అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఏపీ సర్కార్ అక్రమంగా సాయుధ బలగాలతో తరలివచ్చి డ్యామ్‌ను కుడివైపు 13వ గేట్ వరకు, కుడి కాలువ రెగ్యులేటరీని ఆక్రమించుకోవడం, కేంద్రం జోక్యం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను ఏర్పాటుచేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్యామ్‌ను పూర్తిగా కేఆర్ఎంబీ తన ఆధీనంలోకి తీసుకున్నది.
డ్యామ్‌కు సంబంధించిన మరమ్మతులు చేపట్టాలన్నా, డ్యామ్ పైకి ఇరు రాష్ర్టాల అధికారులను అనుమతించాలన్నా, కేఆర్ఎంబీ నుంచి తప్పనిసరిగా అనుమతి ఉండాలని కేంద్రం సీఆర్ఫీఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డ్యామ్ మరమ్మతు పనులకు అనుమతివ్వాలని గత సంవత్సరం బోర్డును కోరింది. అందుకు బోర్డు అంగీకరించింది. దీంతో మిగిలిన మరమ్మతు పనులను తెలంగాణ సర్కార్ పునఃప్రారంభించగా, వాటిపై ఏపీ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఆ తరువాత ఏపీ భూభాగంలో ఉన్న డ్యామ్ నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, మెయింటనెన్స్ పనులను తామే చూసుకుంటామని బోర్డుకు తెలిపింది. అందుకు అనుమతులు ఇవ్వాలని బోర్డు చైర్మన్‌కు లేఖ రాసింది. ఏపీకి చెందిన ఇంజినీరింగ్ అధికారులు, సహాయక సిబ్బందిని అనుమతించాలని, ఏపీ జలవనరుల శాఖ, జెన్కోలకు చెందిన వాహనాలను సైట్ సందర్శన సమయంలో నాగార్జునసాగర్ డ్యామ్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు, వర్షాకాలం ముందు, ఆ తరువాత చేపట్టాల్సిన తనిఖీలు, సాధారణ, అత్యవసర పనులు, నీటి విడుదలను పర్యవేక్షణను ఏపీకే అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో మరమ్మతు పనుల అంశంపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి, అందులో నిర్ణయం తీసుకోవాలని బోర్డు గతంలో నిర్ణయించినా ఆ తరువాత ఏపీకే అప్పగించింది. ప్రస్తుతం డ్యామ్ కుడి వైపు భాగం నిర్వహణ అంతా ఏపీ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతున్నది.
కుడివైపు హెడ్‌రెగ్యులేటరీ మరమ్మతులు, డ్యామ్‌కు సంబంధించిన 13 గేట్ల నిర్వహణ, మరమ్మతులను తెలంగాణ చేపట్టకుండా అడ్డుకున్న ఏపీ సర్కార్& హెడ్‌రెగ్యులేటరీ గేట్లను ఇష్టారాజ్యంగా ఆపరేట్ చేయడం, గ్రీజింగ్ తదితర పనులను నిర్వహించకపోవడంతో అనేక రకాల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గేట్లు ప్రస్తుతం ప్రమాదకర స్థితికి చేరుకున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల డ్యామ్‌ను సందర్శించిన ఎన్డీఎస్ఏ, కేఆర్ఎంబీ బృందం సైతం కుడి కాలువ హెడ్‌రెగ్యులేటరీ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అయితే, అందుకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని పేర్కొంటూ ఏపీ సర్కార్ ఉల్టా వాదనలు మొదలు పెట్టడమేగాక, బోర్డుకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సర్కార్ లేఖ రాసిందే తడువుగా బోర్డు సైతం తెలంగాణ సర్కార్‌ను వివరణ కోరడం విమర్శలకు తావిస్తున్నది. ఈ నేపథ్యంలో త్వరలోనే బోర్డు సమావేశం నిర్వహించేందుకు కేఆర్ఎంబీ కసరత్తు చేస్తున్నది. ఈ సారైనా నాగార్జునసాగర్‌ను తిరిగి తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంటుందా? లేదా ఏపీకే వదిలేస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొన్నది.