SCR | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఆర్భాటాలే తప్ప సరైన కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వేలకు అరకొర కేటాయింపులతో సరిపెట్టారు. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు జరిపిన కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. ఈ జోన్‌కు కేవలం రూ.14,232.84 కోట్లు కేటాయించారు. ఆ నిధుల్లో తెలంగాణకు రూ.రూ.5071 కోట్లు మాత్రమే విదిల్చారు. రాష్ట్రంలో కొత్త రైల్వే ప్రాజెక్టుల ఊసెత్తలేదు. డబుల్, ట్రిపుల్ లైన్ల పేరుతో గతంలో మంజూరైన ప్రాజెక్టులకు స్వల్పంగా నిధులు కేటాయించడం మినహా చెప్పుకోదగ్గ కొత్త ప్రాజెక్టులేమీ ప్రకటించలేదు. దీనితోపాటు ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఉద్యోగులకూ ఏమీ ఒరగలేదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ తాత్కాలిక బడ్జెట్లో ఈసారి దక్షిణ మధ్య రైల్వేకి రూ.14.232.84 కోట్లు కేటాయించినట్టు జోనల్ జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. ఇందులో ఏపీకి రూ.9,138 కోట్లు, తెలంగాణకు 5,071 కోట్లు దక్కుతాయని శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిరుటితో పోలిస్తే ఈసారి తమ జోన్‌కు కేటాయింపులు రూ.446.65 కోట్లు పెరిగినట్టు చెప్పారు.