హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో సోమవారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో ఓఎన్జీసీ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చి.. బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్కావడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సాంకేతిక విభాగం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. వెంటనే సమీప ప్రాంత ప్రజలను లక్కవరం కల్యాణ మండపానికి తరలించింది. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు.