KRMB | హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)పై తెలంగాణ పట్టు కోల్పోతున్నది. ఇప్పటికే కృష్ణా జలాలను ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్న ఏపీ.. మొత్తంగా కేఆర్ఎంబీనే తన చెప్పుచేతల్లో పెట్టుకుని గుత్తాధిపత్యం చెలాయించబోతున్నది. అందుకు అనుకూలంగా బోర్డు సైతం పావులు కదుపుతున్నది. బోర్డులోని ఖాళీ పోస్టులన్నింటినీ ఏపీ అధికారులతో భర్తీ చేసేందుకు సన్నద్ధమవుతున్నది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీ, వివాదాల పరిష్కారానికి రివర్ బోర్డులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ బోర్డుల్లో చైర్మన్, మెంబర్ సెక్రటరీ, ఇద్దరు మెంబర్లను కేంద్రం నియమిస్తుంది. మిగతా బోర్డు సెక్రటేరియట్లో ఎస్ఈలు, ఈఈలు, డీఈఈలు, ఏఈఈలను ఇరు రాష్ర్టాలు సమాన నిష్పత్తిలో నియమించుకుంటాయి. ప్రస్తుతం కేఆర్ఎంబీలో తెలంగాణకు సంబంధించిన పలు పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇదే అదునుగా ఆ పోస్టులన్నింటినీ తమ అధికారులతో భర్తీచేసేందుకు ఏపీతోపాటు బోర్డు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. కేఆర్ఎంబీలో 2 ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీర్), 4 ఈఈ (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), 6 డీఈఈ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), 10 ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పోస్టులు కలిపి మొత్తం 22 పోస్టులున్నాయి.
ఆ పోస్టులను ఇరు రాష్ర్టాల అధికారులతో సమాన నిష్పత్తిలో భర్తీ చేయాలి. ఇవి కాకుండా ఎలక్ట్రికల్ ఇంజినీర్, అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వాటిలో ఏపీకి సంబంధించిన 50% పోస్టులన్నీ ఆ రాష్ట్ర అధికారులతో భర్తీ చేశారు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన 50% కోటాలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక ఈఈ పోస్టుతోపాటు 5 ఏఈఈ పోస్టుల్లో 4 ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ కోటాలోని పోస్టుల భర్తీ కోసం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గత మార్చి నుంచి దాదాపు 4 దఫాలుగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ మేరకు అన్ని యూనిట్లకు సర్క్యూలర్‌ను జారీచేసినప్పటికీ డిప్యూటేషన్‌పై వెళ్లి కేఆర్ఎంబీలో విధులు నిర్వర్తించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ ఉద్యోగులెవరూ ఆసక్తి చూపడంలేదు. త్వరలో కేఆర్ఎంబీని ఏపీకి తరలిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో అక్కడికి వెళ్లేందుకు తెలంగాణ ఉద్యోగులెవరూ ముందుకు రావడంలేదని తెలుస్తున్నది.
కేఆర్ఎంబీలో తెలంగాణ కోటా పోస్టులను దీర్ఘకాలం నుంచి భర్తీ చేయకపోవడంతో పరిపాలనపరమైన సాకులు చూ పుతూ ఆ పోస్టులను ఏపీ అధికారులతో భర్తీ చేయాలని బోర్డు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే ఏఈఈ పోస్టులన్నింటిలో ఏపీ అధికారులే తిష్ట వేస్తారు. అది తెలంగాణకు చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుందని రాష్ట్ర ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించాలని, కేఆర్ఎంబీలో తెలంగాణ కోటా అధికారులను త్వరగా భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.