Andhajyothy | హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): తెలంగాణపై తొలి నుంచీ విషం కక్కుతున్న ‘అంధజ్యోతి’ మరోమారు తన దుర్బుద్ధిని బయటపెట్టింది. తాజాగా ప్రతీ అక్షరాన్నీ పేర్చి ధాన్యం టెండర్లపై వాస్తవాలను విస్మరించి అడ్డగోలుగా ఓ వార్త రాసి పడేసింది. కనీస ఆధారాలు లేకుండానే నోటిలెక్కలతో ‘900 కోట్లకు స్కెచ్’ అంటూ అడ్డదిడ్డంగా వండేసింది. ధాన్యాన్ని తీసుకోబోమని కేంద్రం తెగేసి చెబితే రైతులకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆ పత్రిక ఎక్కడా పేర్కొనలేదు. బ్యాంకుల నుంచి అప్పు తీసుకొచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడా ధాన్యాన్ని విక్రయిస్తుంటే మాత్రం గగ్గోలు పెడుతున్నది. మరో 10-15 రోజుల్లో కొత్త ధాన్యం రాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని తీసుకోకపోవడంతో మిల్లులన్నీ ధాన్యంతో నిండిపోయాయి. ఇప్పుడు వాటిని విక్రయించకుంటే కొత్త ధాన్యం నిల్వలకు చోటుండదు. రైతులు ఇబ్బంది పడొద్దనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కూడా ‘అంధజ్యోతి’కి తప్పుగా కనిపించింది. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే దాని నైజమని మరోమారు తేటతెల్లమైంది.
అక్రమాల్లేకుండానే గోల్ జరిగిందట
ధాన్యం విక్రయాల్లో ఇప్పటికే అక్రమాలు జరిగినట్టుగా గోల్ శీర్షికతో అంధజ్యోతి వార్త ప్రచురించింది. టెండర్ ధరను ప్రభుత్వం ఖరారు చేయకుండానే గోల్ జరిగినట్టుగా నిర్ధారించేసింది. అంతేకాకుండా దానిని సమర్థించుకోవడాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. శనివారం రాత్రి వరకు టెండర్ల ఫైల్ పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చేరలేదు. ఆ శాఖ కమిషనర్ కూడా ప్రభుత్వానికి ఫైలు పంపినట్టు మాత్రమే పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని ఆ పత్రిక మర్చిపోయింది. ఈ ఫైల్ ఇంకా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దనే ఉంది. అక్కడి నుంచి మంత్రికి రావాలి. ఆ ప్రక్రియ ఇంకా జరగనేలేదు. టెండర్ ఫైల్ మంత్రికి చేరలేదని ‘నమస్తే తెలంగాణ‘ రాస్తే… దొంగజ్యోతి మాత్రం ప్రభుత్వానికి చేరిందంటూ తప్పుడు కథనంతో నిందలు వేసింది. మరో అబద్ధాన్ని కూడా యథేచ్ఛగా అచ్చేసింది. మిల్లర్లు మద్దతు ధరకు కావాలని అడగలేదు. వారు ధాన్యాన్ని ఇన్ని రోజుల పాటు నిల్వ చేసినందుకు క్వింటాలుకు రూ. 340 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒక్క నిజామాబాద్ జిల్లా మిల్లర్లు మాత్రం మద్దతు ధరకు తీసుకుంటామని అడిగారు. ఆ ఒక్క జిల్లాలో మిల్లర్లకు ఇచ్చి మిగిలిన జిల్లాల్లో టెండర్లు పిలిస్తే విమర్శలతో పాటు ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతో మొత్తం ధాన్యాన్ని టెండరు ద్వారానే విక్రయించాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. వాస్తవం ఇలా ఉంటే అంధజ్యోతి మాత్రం అసత్యాలతో ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్ర పన్నింది.
అప్పుడొకలా.. ఇప్పుడు మరోలా
టెండర్ నిబంధనలు కఠినతరం చేస్తే ఇదే ఆంధజ్యోతి స్థానిక మిల్లర్లకు అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా పెట్టారంటూ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు నిబంధనలు సడలించి టెండరు వేస్తే మిల్లర్లకు అనుకూలంగా చేసిందంటూ రెండు నాల్కల ధోరణి అవలంబించింది. టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకుంటే చాలు లోడు ఎత్తకుండా కోట్లు మారుతాయంటూ కనీస జ్ఞానం లేకుండా వార్తను వండేసింది. రూ. 900 కోట్లు, రూ.1500 కోట్లంటూ విష ప్రచారం చేసింది. ధాన్యం మొత్తం ఆయా జిల్లాల్లో మిల్లర్ల వద్దే ఉంది. అలాంటప్పుడు టెండరులో పాల్గొన్న మిల్లర్లు టెండరు దక్కించుకుంటే ఆ ధాన్యం వారికే సొంతమవుతుంది. అలాంటప్పుడు దాన్ని తరలించాల్సిన అవసరం ఏముంటుంది? మిగిలిన వారు ఎవరైనా దక్కించుకుంటే వారు తీసుకెళ్తారు. ఇంత చిన్న లాజిక్ పక్కనపెట్టేసి అడ్డగోలుగా ఆరోపణలకు తెగబడింది.