తెలంగాణ సాహితీ దిగ్గజం దివికేగింది.. మూడు దశాబ్దాలకుపైగా కవిగా, గేయ రచయితగా తెలంగాణ ‘ప్రత్యేక’ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ప్రసిద్ధిగాంచిన కవి, రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీత అందెశ్రీ (64) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి
ప్రధాని మోదీ, సీఎం, మంత్రులు, సాహితీవేత్తల సంతాపం
భౌతికకాయం వద్ద నివాళులర్పించిన కేటీఆర్, ప్రముఖులు
ఎన్‌ఎఫ్‌సీనగర్‌లో అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ/అడ్డగుట్ట, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాహితీ దిగ్గజం దివికేగింది.. మూడు దశాబ్దాలకుపైగా కవిగా, గేయ రచయితగా తెలంగాణ ‘ప్రత్యేక’ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ప్రసిద్ధిగాంచిన కవి, రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీత అందెశ్రీ (64) సోమవారం ఉదయం హఠాన్మరణం చెందారు. హైదరాబాద్‌లోని లాలాపేటలో నివసిస్తున్న ఆయన తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో తీవ్రమైన నొప్పితో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన కన్నుమూశారని గాంధీ దవాఖాన వైద్యులు ప్రకటించారు.
ప్రాతఃకాలాన్నే అందెశ్రీ మరణవార్త తెలంగాణ సాహితీలోకాన్ని శోకసంద్రంలో ముంచివేసింది. ప్రజల సందర్శనార్థం అందెశ్రీ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు లాలాపేటలోని జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియానికి తరలించారు. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో మంగళవారం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందెశ్రీ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఆయా పార్టీలకు చెందిన నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.
సినిమా రంగంలోనూ రాణింపు..
విలక్షణ రచనలు, విభిన్నమైన పాటలు రచిం చి, ఆలపించి గుర్తింపు తెచ్చుకున్న అందెశ్రీ సినిమారంగంలోనూ రాణించారు. బతుకమ్మ (2008) సినిమాకు సంభాషణలు రాశారు. ‘గంగ’ సినిమాలో రాసిన ‘యెల్లపోతున్నావ తల్లి…’ పాటకు గాను ఉత్తమ గీత రచయితగా రాష్ట్రప్రభుత్వం నుంచి 2006లో నంది అవార్డు అందుకున్నారు. ఆశు కవిత్వం చెప్పడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయనను 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ వరించింది. 2015లో రావురి భరద్వాజ, దాశరథి అవార్డులు అందుకున్నారు. 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లభించాయి. లోక్‌నాయక్ అవార్డును సైతం అందుకొన్న ఘనత ఆయనది.
అందెశ్రీ రచనలు చరిత్రాత్మకం: కేటీఆర్
అందెశ్రీ రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియానికి వెళ్లి అందెశ్రీ పార్థివదేహాన్ని సందర్శించి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అందెశ్రీ సేవలను స్మరించుకుంటూ.. ఆయన మృతి తెలంగాణ సమాజానికి, సాహితీలోకానికి తీరని లోటని పేర్కొన్నారు. గ్రామగ్రామాన జయజయహే తెలంగాణ గేయంతో ప్రజలను చైతన్యపరిచారని వివరించారు. ఆయన సేవలు, రచనలు, పాటలు తెలంగాణ ఉన్నంత కాలం నిలిచిపోతాయని పేర్కొన్నారు.
అందెశ్రీ హఠాన్మరణం తనను ఎంతగానో కలిచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఇండోర్ స్టేడియానికి వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. అనంతరం ఆయనతో ఉద్యమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అందెశ్రీ మృతితో తెలంగాణ సాహితీలోకం ఒక గొప్ప రచయితను కోల్పోయిందని అన్నారు. ఆయన వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. అందెశ్రీ మరణంపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పద సాహిత్యం, పద్య కవిత్వం నుంచి తనదైన దారి వేసుకొని సాగిపోయిన గొప్ప కవి అందెశ్రీ అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కొనియాడారు.
తెలంగాణ ప్రజానీకంలో ఆయనది సుస్ధిర స్థానమని, ఈ నేల ఎప్పటికీ ఆయన పాటలను గుర్తుపెట్టుకుంటుందని కొనియాడారు. తెలంగాణ గిరుల నుంచి కొండనాగు లాంటి గొంతు అజరామరం..ఆయనకు అశ్రునివాళి అని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, పద్మారావుగౌడ్, కొప్పుల ఈశ్వర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌కుమార్, శంభీపూర్ రాజు, మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, నాయకులు అందెశ్రీ భౌతికదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరిశంకర్, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ తదితరులు నివాళులర్పించారు. ప్రజా కవులు, రచయితలు, గాయకులు సుద్దాల అశోక్ తేజ, జైరాజ్ తదితరులు సంతాపం తెలిపారు.
ప్రధాని మోదీ, సీఎం సంతాపం
అందెశ్రీ మరణంపై ప్రధానమంత్రి మోదీ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మృతితో తెలంగాణ ఓ మంచి సాహితీవేత్తను కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో వారి కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. అందెశ్రీ మరణంతో తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలిందని సీఎం రేవంత్‌రెడ్డి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో తన ఆటపాటలతో అందెశ్రీ ముఖ్య భూమిక పోషించారని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందెశ్రీ మృతికి సంతాపం ప్రకటించారు.
స్పీకర్, మంత్రుల సంతాపం..
అందెశ్రీ మృతిపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, సంతాపం ప్రకటించారు. సీపీఐ నేతలు పల్లావెంకట్‌రెడ్డి, నారాయణ, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యం, పశ్య పద్మ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సాగర్ తదితరులు నివాళులర్పించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, అర్వింద్, రఘునందన్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సంతాపం తెలిపారు.
ప్రవాసీ తెలంగాణ వాసుల సంతాపం
అందెశ్రీ మృతికి ప్రవాసీ తెలంగాణ వాసులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ మరణం బాధాకరమని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) అధ్యక్షురాలు వాణి ఏనుగు, లక్ష్మణ్ పేర్కొన్నారు. అందెశ్రీ మృతికి టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న సోమవారం ఒక సంతాప సందేశం విడుదల చేశారు.
గొర్రెల కాపరిగా జీవిత ప్రస్థానం..
అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. ప్రస్తుత సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో ఆయన 1961 జూలై 18న జన్మించారు. ఆయనకు భార్య ఎల్లుబాయి, ముగ్గురు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన అందెశ్రీ గొర్రెల కాపరిగా జీవనం ప్రారంభించారు. కొన్నేళ్లు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. బడికి వెళ్లకుండా, గురువు లేకుండానే ఓనమాలు నేర్చుకున్నారు. కడుపేదరికం అనుభవించిన అందెశ్రీ కలంపట్టి పేదలు పడుతున్న ఇబ్బందులు, సమాజంలో మార్పులపై రచనలు ప్రారంభించారు. తనదైన శైలిలో పాటలు, విలక్షణమైన రచనలతో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
నిప్పుల వాగు మహత్తర గ్రంథంతో పాటు జయజయహే తెలంగాణ, జై బోలో తెలంగాణ, గలగల గజ్జెలబండి, కొమ్మచెక్కితే బొమ్మరా, జనజాతరలో మనగీతం, యెల్లపోతున్నావ తల్లి’ తదితర అనేక ప్రసిద్ధ గీతాలు రచించారు. ఆయన రచించి ఆలంపించిన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు పాట గుర్తింపు తెచ్చింది. కాకతీయ యూనివర్సిటీ అందెశ్రీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ఎంపికచేసింది. ఇటీవల కోటి నగదు పురస్కారం అందించి గౌరవించింది.
తెలంగాణకు తీరని లోటు: కేసీఆర్
అందెశ్రీ అకాల మరణంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అందెశ్రీ మృతి తెలంగాణ సాహితీరంగానికి తీరనిలోటని అభివర్ణించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకభూమిక పోషించారని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. అందె శ్రీ మరణంతో శోకతప్త హృదయులైన వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.