KCR | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీది అరాచక, దోపిడీ చరిత్ర అని, అధికారంలోకి రాగానే వసూళ్లపర్వానికి తెరతీశారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చీరాగానే పారిశ్రామికవేత్తలను, రియల్ఎస్టేట్ వ్యాపారులను, మైనింగ్ ఇలా అనేకరంగాలవారిని కర్ణాటక తరహాలో వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తమ వద్ద సమస్త సమాచారం ఉన్నదని హెచ్చరించారు. అతిత్వరలోనే కాంగ్రెస్ నిజస్వరూపం రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు, నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ చరిత్ర మొత్తం అరాచకాలు,దోపిడీలే. ఇప్పటికే ఆ పార్టీలో ముఠాలు తయారయ్యాయి. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. రియల్ఎస్టేట్, మైన్లు.. ఇలా అనేక రంగాలవారిని వేధింపులకు గురిచేస్తున్నారు. మా వద్ద సమస్త సమాచారం ఉన్నది.
-బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
ప్రజా జీవితంలో ఉండటం అంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదని, నిరంతరం ప్రజలతో మమేకం కావాలని, గెలుపోటములతో సంబంధంలేకుండా పనిచేయాలని కేసీఆర్ ఉద్బోధించారు. రాజకీయాల్లో గెలుపు-ఓటమి రెండూ ఉంటాయని, ఏ పాత్రలోనైనా ఇమిడిపోవాలని సూచించారు. ‘గెలిస్తే ఉంటాం.. లేకపోతే ప్రజలతో ఉండబోం’ అనడం అవివేకమని చెప్పారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ మరణించినప్పుడు అయ్యో దేశం ఏమవుతుందని భయపడ్డారని, ఆ తర్వాత ఇందిరాగాంధీ ఒకవెలుగు వెలిగారని, ఆమె మరణించినప్పుడు కూడా అదేభావన కొంతమందిలో ఉండేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ వంటి నేత లేడని అనిపించేదని, ఆయన గతించిన తర్వాత కూడా రాజకీయాలున్నాయని, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు. వ్యక్తుల కోసం రాజకీయం ఉండదని, పార్టీలు ఉంటాయని, వ్యక్తులు వస్తారు, వెళ్తారని పేర్కొన్నారు. పార్టీయే నాయకులను సృష్టిస్తుందని, నాయకులు పార్టీని సృష్టించలేరని స్పష్టంచేశారు. పార్టీ వ్యవస్థీకృతమై ఉన్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరని అన్నారు.
ఎన్నికల్లో గెలుపు, ఓటమి సహజమని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, భయపడకుండా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించినపుడే ధీరోదాత్తులం అవుతామని కేసీఆర్ ఉద్బోధించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ధీరోదాత్తులుగా ఉండాలని ఆకాంక్షించారు. ఓటమి ఎదరురైనంత మాత్రాన కుంగిపోవడం సరికాదని, మరింత, రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ‘గాడిదలకు, గుర్రాలకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మనం చేసిన మంచి పనులను ప్రజలు ఇప్పుడు తల్చుకుంటున్నారని, మన శ్రమ వృథాపోదని స్పష్టంచేశారు. మళ్లీ అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామన్న ధీమా వ్యక్తంచేశారు. ఓర్పు, సహనంతో పనిచేద్దామని సూచించారు. కుదుపులు వచ్చినప్పుడు కిందపడకుండా, తట్టుకొని నిలబడి ముందుకు సాగాలని కర్తవ్యబోధ చేశారు. పదవులొక్కటే ముఖ్యం కాదని, ప్రజల మమకారం చూరగొనాలని సూచించారు. ఓటమి కూడా మనకు ఒక మంచి అవకాశమని, మనల్ని మనం మరింత రాటుదేలేలా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఓటమిని కూడా అవకాశంగా మలచుకుందామని, ఒకరకంగా ఓడిపోవడం దిష్టితీసివేసినట్టు అయ్యిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేసింది. కాస్ట్ రేషియో కన్నా మానవీయ కోణమే ముఖ్యమని నిర్ణయించుకున్నాం. అందుకే పాతాళంలో ఉన్న గంగమ్మను పైకెత్తి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని, రైతుల కన్నీటిని తుడిచే ప్రయత్నం చేశాం. కాస్ట్ రేషియోను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా కట్టలేం.
రాష్ట్రంలో రైతులను ఆదుకునేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను చేపట్టిందని కేసీఆర్ గుర్తుచేశారు. నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వడం, కల్తీ విత్తనాలు లేకుండా చూడటం, ఎరువులు అందుబాటులో ఉంచడం, ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించడం, మిషన్ కాకతీయ పేరుతో చెరువులను బాగుచేసి, వాటిలో నీళ్లు నింపి భూగర్భజలాలు పెరిగేలా చూడటం, మద్దతు ధర, రుణమాఫీ, రైతుబంధు తదితర కార్యక్రమాలను బీఆర్ఎస్ సర్కారు చేపట్టిందని వివరించారు. రైతులు.. వ్యాపారులు కాలేరని, అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి అనేక విప్లవాత్మక చర్యలు తీసుకొన్నామని చెప్పారు.
రైతుబంధు ఇవ్వడంతో గతంలో ఊర్లను వదిలివెళ్లినవారు తిరిగి గ్రామాలకు వచ్చి వ్యవసాయంలో నిమగ్నమైన పరిస్థితిని తెలంగాణలో తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చామని, దేశంలో మరే నగరానికి లేనివిధంగా విద్యుత్తు హైదరాబాద్‌కు అందుబాటులో ఉండేలా చేశామని గుర్తుచేశారు. నేషనల్గ్రిడ్, స్టేట్‌గ్రిడ్ నుంచి హైదరాబాద్‌కు విద్యుత్తు సరఫరా అయ్యేలా చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించి, విద్యుత్తు ఇవ్వడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని వివరించారు. ఇప్పుడు చేస్తున్నట్టు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పీఆర్ స్టంట్లు చేయలేదని చెప్పారు.
గాడిదలకు, గుర్రాలకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారు. మనం చేసిన మంచి పనులను ప్రజలు ఇప్పుడు తల్చుకుంటున్నారు. మన శ్రమ వృథాపోదు. మళ్లీ అద్భుతమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఓర్పు, సహనంతో పనిచేద్దాం.
-బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ చరిత్ర చూస్తే ఆ పార్టీ ఏనాడూ ప్రజలకు మేలు చేయలేదని స్పష్టంగా కనబడుతున్నదని కేసీఆర్ చెప్పారు. 1989లో టీడీపీ ఓడిపోయినప్పుడు ఎన్టీఆర్‌తో తాను ఉన్నానని, ఒక ఐదేండ్లు ఓపికపడితే కాంగ్రెస్‌వాళ్లే మనకు అధికారం అప్పగించి వెళ్తారని చెప్పానని, తాను అన్నట్టుగానే 1994లో అధికారాన్ని టీడీపీకి అప్పగించారని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం అరాచకాలు, దోపిడీనే అని, బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు, మూడు నెలలు ఓపికపడితే కాంగ్రెస్ పార్టీనే ఎజెండాను మనకు అప్పగిస్తుందని విశ్లేషించారు. ఇప్పటికే ఆ పార్టీలో ముఠాలు తయారయ్యాయని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, రియల్ఎస్టేట్, మైన్లు.. ఇలా అనేక రంగాలవారిని వేధింపులకు గురిచేస్తున్నారని చెప్పారు. తమ వద్ద సమస్త సమాచారం ఉన్నదని తెలిపారు. కర్ణాటకలో మాదిరిగానే ఇక్కడ కూడా వసూళ్లకు ప్రణాళికలు వేసుకున్నారని ఆరోపించారు. మరో రెండు-మూడు నెలల్లో అంతా ప్రజల అనుభవంలోకి వస్తుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముగ్గురు నేతల మధ్య ఆధిపత్యపోరులా మారిందని విమర్శించారు. కాంగ్రెస్‌లో అనేక పంచాయితీలు ఉంటాయని, ఈ ఐదేండ్లు మనం చూసుకుంటూ ఉంటే చాలని పేర్కొన్నారు.
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి పోటీచేస్తారని కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో లక్షా 70 వేల ఓట్ల మెజార్టీతో ఖమ్మం సీటును గెల్చుకున్నామని, ఈ సారి కూడా గెల్చుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా అని, విజయం సాధించే దిశగా పయనిద్దామని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకు తిరిగి టికెట్ ఇస్తున్నామని, ఆమె కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. మహబూబాబాద్ స్థానంలో పార్టీకి మంచి నాయకత్వం ఉన్నదని మెచ్చుకున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలపై ఎలాంటి ఆరోపణలు లేవని, స్వచ్ఛమైన నాయకులని కితాబిచ్చారు.
ఎకనామిస్ట్‌లు, ఆడిటర్లు.. నీళ్ల ప్రాజెక్టుల కాస్ట్ రేషియో గురించి మాట్లాడుతుంటారని, కాళేశ్వరం విషయంలో ఇలాంటి కథలే చెప్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని, లాభాపేక్షతో పనిచేయదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు సాగు, తాగునీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా బీఆర్ఎస్ సర్కారు పనిచేసిందని, కాస్ట్ రేషియో కన్నా మానవీయ కోణమే ముఖ్యమని నిర్ణయించుకున్నామని చెప్పారు. అందుకే పాతాళంలో ఉన్న గంగమ్మను పైకెత్తి తీసుకొచ్చి ప్రజల దాహార్తిని, రైతుల కన్నీటిని తుడిచే ప్రయత్నం చేశామని వివరించారు. కాస్ట్ రేషియోను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణలో ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా కట్టలేమని, ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేమని స్పష్టంచేశారు.
అరబ్బు దేశాల్లో సముద్రపు నీటిని వడపోసి తాగునీటిగా మారుస్తారని, నీళ్లు లేకపోతే మానవ మనుగడ ఉండదని, కాస్ట్ రేషియో చూసుకుంటే అక్కడ నీళ్లే తాగొద్దని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోణంలో పనిచేయాలని, ప్రజల ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు రకరకాల పద్ధతులను అనుసరించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ కోణంలోనే పదేండ్లపాటు పనిచేశామని, తెలంగాణ ప్రయోజనాలే బీఆర్ఎస్కు అంతిమం అని స్పష్టంచేశారు. తాము తీసుకున్న చర్యలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని, భూముల విలువ, తలసరి ఆదాయం, రాష్ట్ర జీఎస్డీపీ పెరిగిందని, మొత్తంగా దేశంలోనే తెలంగాణ అనేక ప్రమాణాల్లో నంబర్‌వన్‌గా నిలిచిందని వివరించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ స్పష్టంచేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ అని, బీఆర్ఎస్ శక్తి… తెలంగాణ ప్రజల శక్తి అని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తెగించి కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, పార్టీని నిలబెట్టుకుందాం, రాబోయే ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధిద్ద్ధామని పిలుపునిచ్చారు.
సమావేశానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కేసీఆర్‌తోపాటు సమావేశానికి హాజరైన నేతలందరూ అభినందనలు తెలియజేశారు. వద్దిరాజుకు రెండోసారి రాజ్యసభ దక్కినందుకు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటూ ఎమ్మెల్యే అయినందుకు అభినందించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, హరీశ్‌రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తాతా మధు, సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, ముఖ్య కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
మంగళవారం నాడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాల పరిధిలోని పార్టీ ముఖ్యనేతలతో పార్టీ కార్యాలయం తెలంగాణభవన్‌లో భేటీ అవుతారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను నిర్ణయించి ప్రకటిస్తారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం, వ్యూహంపై నేతలకు మార్గనిర్దేశనం చేస్తారు.
మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు ఇచ్చేందుకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామని, ఇప్పుడేమో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా నీళ్లు ఇవ్వడంలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రజలను ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు సరఫరాకు బీఆర్ఎస్ సర్కారు సకల ఏర్పాట్లు పూర్తిచేసి పెట్టిందని, కానీ, వాటిని నీరుగారుస్తున్నదని, అవగాహనారాహిత్యంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. రైతుల పొలాలకు నీళ్లు కూడా రావడంలేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనంతోనే ఇలా అవుతున్నదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న సభలు, సమావేశాల్లో కరెంటు పోతే ‘జై కాంగ్రెస్’ అని ప్రజలు అంటున్నారని, సోషల్ మీడియాలో తాను ఈ విషయాన్ని చూశానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఖజానాలో లంకెబిందెలు ఉంటాయనుకున్నాం.. లేవు అని వ్యాఖ్యానించారని, ఇది వారి అవగాహనారాహిత్యానికి నిదర్శనమని కేసీఆర్ మండిపడ్డారు. ‘వాళ్లు అధికారాన్ని మనకు అప్పగించిపోయినప్పుడు లంకెబిందెలు ఇచ్చిపోయిండ్రా? మనం 2014లో అధికారం చేపట్టేనాటికి ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. మనం ఏనాడైనా వాళ్ల లెక్క మాట్లాడినమా? ప్రభుత్వ ఖజానాలో ఏనాడూ డబ్బులు ఉండవు. వచ్చిన సొమ్మును వచ్చినట్టు ఖజానాలో దాచిపెడితే అది ప్రభుత్వం కాదు.. వడ్డీవ్యాపారి దుకాణం అవుతుంది. డబ్బు వస్తుంది.. వెళ్తుంది. నిల్వ చేయడానికి అక్కడ ఏమీ ఉండదు. ప్రజాప్రయోజనాల కోసం ఖర్చు పెడుతుంటాం. ఏమైనా కావాలంటే లెక్కలు చూసుకోవచ్చు. ఉత్త డొల్ల ముచ్చట్లు చెప్పి తప్పించుకోవద్దు. బాధ్యత తీసుకొని ముందుకెళ్లాలి’ అని హితవు చెప్పారు.