Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వింత అనుభవం ఎదురైంది. రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతిపత్రం అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డికి రివర్స్నోట్ అందింది. మీ వినతుల సంగతి సరే, కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రం వద్ద ఉన్న పెండింగ్ పనులు, నిధుల సంగతేమిటని ప్రధాని మోదీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారుచేయించి మరీ ఆ జాబితాను సీఎం రేవంత్‌రెడ్డి ముందుపెట్టారు. ముందు వీటిని పరిష్కరించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. సుమారు 15-20 నిమిషాలపాటు ఈ భేటీ జరిగినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మెట్రోరైల్ రెండో దశ, ట్రిపుల్ఆర్ దక్షిణభాగం మంజూరు, మూసీ పునరుజ్జీవనానికి రూ. 20 వేల కోట్ల నిధులు, సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతిపత్రం అందజేశారు. వీటిన్నింటిని కొద్దిసేపు నిశితంగా పరిశీలించిన ప్రధాని రేవంత్‌రెడ్డి మాటలు ఆలకించారు. ఆ తర్వాత తన టేబుల్‌పై ఉన్న ఓ పేపర్‌ను తీసి సీఎం రేవంత్‌రెడ్డికి ఇచ్చారు. వాటిని చూసి అవాక్కవడం రేవంత్‌రెడ్డి వంతయింది. కేంద్ర, రాష్ర్టాల వాటాతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, భూసేకరణ, అనుమతులు పెండింగ్‌లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. కేంద్రం వద్ద గల సమస్యలను పరిష్కరించాలని కోరడానికి ముందు మీ వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించినట్టు తెలిసింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి బయటపడ్డారు.
రివర్స్నోట్.. ఇదే తొలిసారేమో!
ప్రధానికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం ఇటు రాష్ట్ర రాజకీయాల్లో, అటు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా ఒక సీఎంకు ప్రధాని రివర్స్నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనను తామెప్పుడూ చూడలేదని అంటున్నారు. పీఎంను కలిసేందుకు సీఎం వెళ్లినప్పుడు లేదా రాష్ర్టానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతుల మంజూరు పత్రాలు, లేదా నిధుల విడుదల పత్రాలను అందిస్తుంటారు. కానీ, ఇక్కడ కేంద్రం తరుపున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంను ప్రధాని నేరుగా కోరడం, ఏకంగా నోట్ ఇవ్వడం సంచలనంగా మారింది. ప్రధాని ఈవిధంగా వ్యవహరించడం వెనుక అంతరార్థం ఏమిటనేదానిపై చర్చ జరుగుతున్నది. రాష్ర్టాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోదీ ఈ వ్యూహం పన్నినట్టు చర్చించుకుంటున్నారు.