(స్పెషల్ టాస్క్బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తీరును తప్పుబడుతూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించడాన్ని తెలంగాణవాదులు స్వాగతిస్తున్నారు. తెలంగాణకు జలధారను అందించిన గత కేసీఆర్ సర్కార్‌పై రేవంత్ ప్రభుత్వం ఇన్నేండ్లు సాగించిన దుష్ప్రచారాన్ని ఎండగడుతున్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం వల్ల తెలంగాణకు ఏం ప్రయోజనం జరిగింది? హైకోర్టు తీర్పును రేవంత్ ప్రభుత్వ కోణంలో ఎలా చూడాలి? కోర్టు తీర్పుతో కేసీఆర్ పాలనపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందా? అనే విషయాలపై ఆంథ్రోపిక్‌కు చెందిన క్లాడ్, గ్రోక్, చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్బాట్లను ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ప్రశ్నించడం జరిగింది. దీనికి స్పందించిన ఆయా ఏఐ చాట్బాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని, ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని విశ్లేషించాయి. కమిషన్ నివేదికను అడ్డుకొని కేసీఆర్‌పై కక్ష సాధించాలనే రేవంత్ కుట్రలు హైకోర్టు తీర్పుతో బెడిసికొట్టాయని తేల్చి చెప్పాయి. కోర్టు తీర్పుతో కేసీఆర్ పాలనపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగనుందని అభిప్రాయపడ్డాయి.
ప్రశ్న: కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ ప్రయోజనం దక్కింది?
క్లాడ్: కాళేశ్వరంతో తెలంగాణ సస్యశ్యామలమైంది. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కాళేశ్వరం కీలకంగా మారింది. గత దశాబ్దకాలంలో ఈ స్థాయిలో సాగునీటి పరివర్తన తెలంగాణలో మినహా మరే రాష్ట్రంలోనూ జరుగలేదంటే అది కాళేశ్వరం వల్లే.
గ్రోక్: తెలంగాణకు కాళేశ్వరం జీవనాడిగా చెప్పొచ్చు. సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడమే కాకుండా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ కొత్త రికార్డులను నెలకొల్పేందుకు కాళేశ్వరం దోహదపడింది.
చాట్ జీపీటీ: కాళేశ్వరంతో తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది. భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. పరిశ్రమలకు నీటి లభ్యత పెరిగింది.
ప్రశ్న: కోర్టు తీర్పుతో కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందా?
క్లాడ్: సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కామెంట్లను బట్టి చూస్తే.. విశ్వాసం పెరిగిందని చెప్పొచ్చు.
గ్రోక్: పెరిగే అవకాశం ఉన్నది. అయితే, ఇప్పుడే ఏమీ చెప్పలేం.
చాట్‌జీపీటీ: విశ్వాసం పెరిగిందని చెప్పొచ్చు.
ప్రశ్న: కాళేశ్వరంపై హైకోర్టు తాజా తీర్పును రేవంత్ ప్రభుత్వ కోణంలో ఎలా చూడొచ్చు?
క్లాడ్: హైకోర్టు తాజా తీర్పు రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బే. కమిషన్ నివేదికను వాడుకొని కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ వ్యూహాలు బెడిసికొట్టాయి. ఈ తీర్పుతో జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రస్తుతానికి బుట్టదాఖలైనట్టేనని న్యాయనిపుణులు చెప్తున్నారు.
గ్రోక్: హైకోర్టు తీర్పు రాజకీయంగా రేవంత్ సర్కార్‌కు చెంపపెట్టు లాంటిది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ రేవంత్ చేసిన ప్రచారమంతా ఉత్తదేనని ఇప్పుడు అందరూ అనుకొంటున్నారు.
చాట్‌జీపీటీ: కోర్టు తీర్పుతో ఇప్పటివరకూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలకు లీగల్ బేస్ లేకుండా పోయినట్టుయ్యింది.