హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీ, ఐఏఎంలలు, సెం ట్రల్ వర్సిటీల వంటి 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు బీసీ కుల సంఘాల నేతలు, విద్యార్థులు ఆనందం వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలియజేశారు.
బీసీల ఆరాధ్య దైవం కేసీఆర్
స్వదేశీ విద్యానిధి పథకం ద్వారా ఏటా 10 వేల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో దేశంలోని ఎంతో మంది పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశయాలు, కలలు నెరవేర్చుకునే అవకాశం లభించింది. జ్యోతిరావు ఫూలే ఆశయాలను కేసీఆర్ నెరవేరుస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
-ఉపేంద్ర, బీసీ కమిషన్ సభ్యుడు
విద్యాప్రదాత కేసీఆర్
వెనకబడిన తరగతుల విద్యాప్రదాత సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడాలేనివిధంగా 327 గురుకులాలు ఏర్పాటుచేసి ఏటా 1.82 లక్షల మంది బీసీలకు డిగ్రీ వరకు ఉచితంగా ఆంగ్లమాధ్యమ విద్య అందిస్తున్న ఘనత తెలంగాణకే దక్కింది. విదేశాల్లో విద్యాభ్యాసానికి ఏక మొత్తంగా 20 లక్షలు సాయం అందిస్తున్నారు. తాజాగా స్వదేశీ విద్యానిధి పథకానికి రూపకల్పన చేయడం చరిత్రాత్మకం. బీసీ బిడ్డల కలల సాకారానికి ప్రోత్సహిస్తున్న సీఎంకుబీసీ సమాజం రుణపడి ఉంటుంది.
-దుండ్ర కుమారస్వామి, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు
బీసీ విద్యార్థులకు గొప్ప వరం
స్వదేశీ విద్యానిధి స్కీం బీసీ విద్యార్థులకు గొప్ప అవకాశం. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాలయలైన ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీలు వంటి 200 పైచిలుకు విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన బీసీ విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తి ఫీజు చెల్లించాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ధన్యావాదాలు.
-రాజేశ్వర్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు
బడుగులకు బాసటగా..
తెలంగాణ ప్రభుత్వం బడుగులకు అన్నివేళలా బాసటగా నిలుస్తున్నది. దేశంలో ఎక్కడాలేనివిధంగా బడగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలు వేస్తున్నది. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీసీ ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్నది. అదేరీతిలో బీసీల ఉన్నత విద్యాభ్యాసానికి సైతం ప్రభుత్వం గొప్ప అవకాశాలను కల్పిస్తున్నది. స్వదేశీ విద్యానిధి పథకం అపురూపం. అద్వితీయం.
-కొండూరు సత్యనారాయణ, ఎంబీసీ జాతీయ కన్వీనర్