హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ కొనుగోలు (టేకోవర్) వ్యవహారంలో, జపాన్ సంస్థ నుంచి తీసుకొంటున్న రుణంపై తక్షణమే సమగ్ర విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మెట్రోను, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తన అహంకారపూరిత, అవగాహన లేని నిర్ణయాలతో నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెట్రో టేకోవర్ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ రియల్ ఎస్టేట్ దందాలకు తెరతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్రోను ప్రభుత్వమే నిర్వహిస్తుందని గొప్పలు చెప్తున్న రేవంత్‌రెడ్డి.. మెట్రో టేకోవర్ పేరుతో నిధుల విషయంలో తీవ్ర గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
2014 నాటికి కేవలం 25 శాతమే పూర్తయిన మెట్రోను కేసీఆర్ ప్రభుత్వం రికార్డు సమయంలో 75 శాతం పూర్తిచేసి రోజూ 5 లక్షల మంది ప్రయాణించేలా అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి సీఎం కాగానే ఎల్అండ్టీ సీఎఫ్‌వోపై కక్షసాధింపు చర్యలకు దిగారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌కు పేరొస్తుందనే అకసుతోనే హైటెక్ సిటీ-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోలైన్‌ను రద్దు చేసి, జనం లేని తన ఫ్యూచర్ సిటీ కోసం మెట్రో కడుతాననడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
ఎల్అండ్టీకి ఈక్విటీ కొనుగోలు కోసం రూ.1,461 కోట్లు, ఐఆర్ఎఫ్సీకి మార్జిన్ మనీ కింద రూ.1,400 కోట్లు, బ్రోకరేజ్ ఫీజు కింద సుమారు రూ.84 కోట్లు.. మొత్తంగా సుమారు రూ.2,940 కోట్ల ప్రజాధనాన్ని ముందే చెల్లించారని ఆరోపించారు. ‘ఇంకా ఒక రూపాయి లోన్ కూడా రాకముందే ఈ చెల్లింపులు ఎలా చేశారు? జపాన్‌కు చెందిన ఒక సంస్థ నుంచి రూ.13,600 కోట్ల అప్పు తీసుకొంటున్నట్టు చెప్తున్నారు.. కానీ ఆ సంస్థ ప్రభుత్వానిదా? ప్రైవేట్‌దా? మీ బినామీలదా? అనే వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదు? ఇంత పెద్ద ప్రాజెక్టును టేకోవర్ చేస్తున్నప్పుడు క్యాబినెట్లో కనీసం చర్చించారా? లేదా? అన్న విషయాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రజలపై రూ.15,000 కోట్ల అప్పు రుద్దుతున్న మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకోవాలని రేవంత్ చూస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన 280 ఎకరాల భూమిని రేవంత్‌రెడ్డి తన బినామీలకు కట్టబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
రూ.13,600 కోట్ల అప్పు ఇస్తున్న జపాన్ సంస్థ వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని దాసోజు శ్రవణ్ కోరారు. మెట్రో టేకోవర్‌కు సంబంధించిన మంత్రివర్గ తీర్మానం కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టాలని, లోన్ రాకముందే ఎల్అండ్టీకి, ఐఆర్ఎఫ్సీకి రూ.2,940 కోట్లు ఏ ప్రాతిపదికన చెల్లించారో డాక్యుమెంట్లు బయటపెట్టాలని డిమాండ్ చేశా రు. ఐఆర్ఎఫ్సీ ఒప్పంద పత్రాలు, ఆర్బీఐ ఆటో-డెబిట్ ఆదేశాల పత్రాలను ప్రజల ముం దుంచాలని, మెట్రో భూములు, మాల్స్ నిర్వహణపై ప్రభుత్వానికి ఉన్న వ్యూహం ఏమిటో స్పష్టం చేయాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.