కామారెడ్డి, జూన్ 11: ముగ్గురు పిల్లలు సహా తల్లి అదృశ్యమైన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కామారెడ్డి టౌన్ సీఐ నరహరి కథనం ప్రకారం.. రాజంపేట మండలం కొండాపూర్‌కు చెందిన యాడారం భానుప్రకాశ్, శ్యామల దంపతులకు ముగ్గురు పిల్లలు. షాపింగ్ కోసమని కామారెడ్డికి వెళ్తున్నామని చెప్పి శ్యామల తన ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం ఇంటి నుంచి బయల్దేరింది. షాపింగ్ పూర్తయ్యాక మధ్యాహ్నం కామారెడ్డిలో ఉండే తన తమ్ముడి ఇంటికి వెళ్లింది.
సాయంత్రం కొండాపూర్‌కు వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి ఆటోలో బస్‌స్టాండ్‌కు బయల్దేరింది. రాత్రి 8 గంటల బస్సుకు వస్తున్నామని భర్తకు ఫోన్లో చెప్పింది. పిల్లలను తీసుకొని వెళ్లిన భార్య ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన భర్త భానుప్రకాశ్ గురువారం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యమైన శ్యామలతోపాటు ముగ్గురు పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.