హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): సర్పంచ్ ఎన్నికపై ఏమైనా అభ్యంతరాలుంటే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం చెల్లదని పేర్కొన్నది. 2019 నాటి జీవో 4 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో ఆర్డీవోనే ఏజన్సీ డివిజనల్ అధికారిగా వ్యవహరిస్తారని గుర్తుచేసింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా టీ-సిర్పూర్ మండలం దోరపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన సోయం సమీరకు 21 ఏండ్ల వయసు లేదన్న కారణంతో ఆ ఎన్నికను రద్దుచేసి, మరొకరిని సర్పంచ్‌గా ఎంపిక చేస్తూ ఏజెన్సీ డివిజనల్ అధికారి (ఆర్డీవో) ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 242 ప్రకారం తొలుత సంబంధిత అధికారి ముందు ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది. జీవో 4 ప్రకారం ఏజెన్సీ డివిజనల్ అధికారిగా కొనసాగుతున్న ఆర్డీవోకు ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.