Wine Shops | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తున్నదంటే చాలు ‘టార్గెట్లు రీచ్ అయ్యారా?’ అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్సైజ్‌శాఖ ‘అదనపు ఒత్తిడి’ని భరించడం తమ వల్ల కాందంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఒక్కో షాపు అదనంగా రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పెద్దల నిర్ణయమో, ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఒత్తిడో తెలియదు కానీ, ఇటు మద్యం వ్యాపారులకు, ఎక్సైజ్ కిందిస్థాయి అధికారులకు అదనపు కష్టాలు వచ్చిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా ఒక్కో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నెల టార్గెట్లు పూర్తి కాలేదని, పై అధికారులు టార్గెట్లు పెట్టారని, వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని మద్యం దుకాణదారులపై నిత్యం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసింది. మూడు నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలకు రూ.3 వేల కోట్లకు మించి జరుగుతున్నాయి. జూన్‌లో రూ.3,175 కోట్లు దాటింది. అయితే, జూలై నెలలో రూ.3 వేల కోట్లలోపే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం చేరాల్సిందేనని రిటైలర్లపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. ‘గోదాముల్లో సరుకు రెడీగా ఉన్నది. ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలి. ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. మందు కొంటారా? లేదా? ముందు ఎంతో కొంత సరుకు తీసుకెళ్లండి’ అంటూ యజమానులకు ఫోన్లు చేస్తున్నారని తెలిసింది. దీంతో చేసేదేమీ లేక డీడీలు చెల్లించి స్టాక్ తీసుకెళ్తున్నారు.
జనాభా ప్రాతిపదికన శ్లాబ్ ప్రకారం టెండర్ దకించుకున్నా, నిర్ణీత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15 శాతం నష్టపోవాల్సి వస్తున్నదని వైన్స్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో రూ.50 లక్షల శ్లాబ్‌లో టెండర్ దకించుకున్న వ్యాపారికి పదిసార్ల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసిన మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకుమించి కొనుగోలు చేస్తే రూ. లక్షకు దాదాపు 15 శాతం అంటే రూ.15 వేలు అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి.
దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం తమకు తలకుమించిన భారంగా మారిందని, వడ్డీలకే డబ్బు సరిపోని పరిస్థితి ఉందని వైన్‌షాప్ యజమానులు వాపోతున్నారు. ‘ఒకో షాపునకు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అదనంగా మద్యం కొని అమ్మాలట. ఇైట్లెతే మేం మందు అమ్మలేం సారు’ అంటూ ‘నమస్తే తెలంగాణ’తో ఓ మద్యం దుకాణదారుడు వాపోయాడు. అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా టార్చర్ ఉందని తోటి వ్యాపారులు కూడా చెప్తున్నారని పేర్కొన్నాడు.
ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి, వడ్డీలకు తెచ్చిన డబ్బులు చెల్లించడానికి తప్పని పరిస్థితుల్లో బెల్టుషాపులకు అడిగినంత మందు ముట్టచెప్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఆఖరికి గ్రామాల్లోని కిరాణా షాపుల్లో సైతం మద్యం దొరుకుతున్నదంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఒకరిని చూసి మరొకరు కొత్త బెల్టుషాపులకు తెర తీస్తున్నారు. వీటిపై ఎక్సైజ్, పోలీసుశాఖలు పూర్తిగా నియంత్రణ కోల్పోయాయి.
ప్రభుత్వ లక్ష్యం నేరవేరేందుకు వారు సైతం బెల్టుషాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారంలోకి రాగానే బెల్టుషాపులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం ఆ హామీని ఏం చేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఓ క్రమపద్ధతిలో మద్యం విక్రయాలు జరుపగా, ప్రస్తుత ప్రభుత్వం ఆ నిబంధనలన్నీ తుంగలో తొక్కి టార్గెట్ల పేరుతో మద్యం వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తున్నది.