Safari | శ్రీశైలం : అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో జంగిల్ సఫారీని జులై ఒకటి నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మన్ననూరు ఫారెస్ట్ అధికారి నల్ల వీరేశ్ తెలిపారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, ప్రతి ఏటా ఈ సమయంలో పులుల సంతానోత్పత్తి కాలం కారణంగా.. అడవి జంతువుల కదలికలకు, సహజ ప్రవర్తనకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, బఫర్ జోన్లలో పర్యాటకులు సఫారీలను ఆస్వాదించొచ్చని పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌ను జులై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు సందర్శకులకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులు, ప్రకృతి ప్రేమికులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. తిరిగి టైగర్ రిజర్వ్ ఒకటి అక్టోబర్ నుంచి పునః ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.