హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): మక్కల కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులవుతున్నా, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నయా పైసా చెల్లించలేదు. యాసంగి పంటకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 9.5 లక్షల టన్నుల మక్కలను కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి రైతులకు రూ. 2,300 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నది. ఇందులో నయాపైసా కూడా చెల్లించకపోవడంతో పైసలు ఎప్పుడొస్తాయంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొనుగోళ్ల కోసం గోస, పైసల కోసం ఎదురుచూపులు తప్పడంలేదని ఆవేదనగా చెప్తున్నారు.
రుణం వస్తేనే.. రైతులకు చెల్లింపులు
పంటల కొనుగోళ్లకు ప్రభుత్వం నిధులు సమకూర్చకుండా అప్పుల మీదనే ఆధారపడుతున్నది. రుణం తీసుకొచ్చిన నిధులతోనే మక్కలు కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. మక్కల కొనుగోళ్ల కోసం మార్క్‌ఫెడ్‌కు రూ.3,571 కోట్లకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రుణం వస్తేనే రైతులకు చెల్లింపులు జరుగనున్నాయి. మార్క్‌ఫెడ్‌కు రుణం ఇచ్చేందుకు ఎన్సీడీసీ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అయితే ఆ నిధుల విడుదలకు మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నదని సమాచారం.
గన్నీ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకూ బకాయిలు
మక్కల కొనుగోలుకు సంబంధించి గన్నీ సరఫరాదారులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సైతం మార్క్‌ఫెడ్ బకాయిలు విడుదల చేయడంలేదని తెలిసింది. ఇప్పటివరకు సరఫరా చేసిన గన్నీ సంచులు, ఏర్పాటుచేసిన వాహనాలకు బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నప్పటికీ ప్రయోజనం లేదని తెలిసింది. ఎంతకాలం తామే మొత్తం భరించాలని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కొనుగోళ్లలో రైతుల తిప్పలు
మక్కల కొనుగోళ్లలో రైతులకు తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంటా పెట్టడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రోజుల తరబడి రైతులు మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు. గన్నీల కొరత, వాహనాల కొరతను తీర్చడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. కొనుగోలు చేసిన మక్కలను నిల్వ చేసేందుకు గోదాములను కూడా సర్దుబాటు చేయలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 43 లక్షల టన్నుల మక్కలు ఉత్పత్తి అయితే ఇప్పటివరకు కొనుగోలు చేసింది 9.5 లక్షల టన్నులు మాత్రమే. మరోవైపు, ఈ నెలాఖరులోగా కొనుగోళ్లు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. నిర్దేశిత గడువులోగా మరో 4 లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.