హైదరాబాద్, జూన్ 7( నమస్తే తెలంగాణ): మంత్రివర్గ విస్తరణపై 17 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో రేవంత్‌రెడ్డి ఆదివారం విస్తరణకు ముహూర్తం ఫిక్స్ చేశారని చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీరానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజ్‌భవన్ వర్గాలను కోరినట్టు సమాచారం. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు మూడునాలుగు బెర్తులు భర్తీ చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి సీల్డ్ కవర్ అందినట్టు సమాచారం. మార్పు చేర్పులతో ఐదు బెర్తులు పూరించాలని తొలుత భావించినా, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురి పేర్లకు ఆమోదం లభించినట్టు తెలిసింది. నాలుగో వ్యక్తికి అవకాశం ఇస్తే, అది మాదిగ సామాజిక వర్గం నుంచే అవుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండొచ్చని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్టేనని గాంధీభవన్ వర్గాల నుంచి తొలుత లీకులు వచ్చాయి. శనివారం ఉదయం అనూహ్యంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. వివేక్ కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురికి పదవులు ఇవ్వడంతో మళ్లీ వారికే ఇస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ అభ్యంతరం వ్యక్తంచేసినట్టు తెలిసింది. దీంతో గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. తనకు అవకాశం ఇవ్వకుంటే ప్రత్నామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని వివేక్ హెచ్చరించినట్టు తెలిసింది. మీడియాతోపాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన కుటుంబాన్ని వదులుకోవడం ఇష్టంలేని అధిష్ఠానం మధ్యేమార్గంగా వివేక్‌కు స్పీకర్ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే, తనకు మంత్రి పదవి తప్ప మరేమీ వద్దని ఆయన కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి విస్తరణలో చోటు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధిష్ఠానాన్ని కోరిన విషయం తెలిసిందే. అధిష్ఠానం ఓకే అనడంతో సుదర్శన్‌రెడ్డి బెర్తు దాదాపు ఖరారైనట్టేనని చెప్తున్నారు. దీంతో ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డికి దారులు మూసుకుపోయినట్టేనన్న ప్రచారం జరుగుతున్నది. బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఉన్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దాదాపు ఖరారైనట్టు తెలిసింది.
అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో ఉన్నారు. మాదిగ ఎమ్మెల్యేలంతా శనివారం మరోసారి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. మీనాక్షి నటరాజన్‌తోనూ మాట్లాడినట్టు తెలిసింది. నాలుగో బెర్తు నింపితే కచ్చితంగా మాదిగలకు అవకాశం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్టు తెలిసింది. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాణ పేరు వినిపిస్తున్నది.
ఎస్టీ సామాజిక వర్గం నేతలు కూడా తమకు విస్తరణలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సామాజిక వర్గం నుంచి ఆదివాసీ మహిళ సీతక్క ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. తక్కువ జనాభా కలిగిన ఆదివాసీకి మంత్రి పదవి ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని లంబాడ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్ఠానానికి లేఖ రాశారు. రాష్ట్ర నాయకత్వాన్ని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. అయితే ఈ విస్తరణలో చోటు కల్పించడం సాధ్యం కాదని అధిష్ఠానం తేల్చి చెప్పినట్టు తెలిసింది. మంత్రి పదవికి బదులుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆఫర్ చేసినట్టు తెలిసింది. దీనికి వారు కూడా అంగీకరించినట్టు సమాచారం.
మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా గ్రూప్ల్లోనే ఈ వార్త ఎక్కువ వైరల్ అవుతున్నది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒక కటుంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలే ఆమె మెడకు చుట్టుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖకు ఉద్వాసన తప్పదని చెప్తున్నారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తమ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని విజ్ఞప్తిచేశారు. సీఎంను కలిసిన వారిలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మానకొండూర్, తుంగతుర్తి, నకిరేకల్, చేవెళ్ల ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేల్, వేముల వీరేశం, కాలె యాదయ్య ఉన్నారు. మంత్రివర్గంలో ఇప్పటికే మాదిగ సామాజిక వర్గానికి చెందిన అందోల్ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ మంత్రిగా వ్యవహరిస్తుండడం, మంత్రి పదవి కోసం విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి మరోమారు చోటు దక్కడం అనుమానమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.