నిజామాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆమ్చూర్ రైతులు ఆగమాగం అవుతున్నారు. గిట్టుబాటుకాని ధరలను చూసి తట్టుకోలేక విలవిల్లాడుతున్నారు. ఓవైపు కాలం కలిసిరాక రాలిన కాయలతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. మిగిలిన మామిడి కాయలతో ఆమ్చూర్ను తయారు చేసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు తీసుకు వస్తే గిట్టుబాటు అన్నదే లేకుండాపోతున్నది. రూ.30వేల నుంచి రూ.35వేలు వస్తే కానీ లాభంలేని ఆమ్చూర్ పంటకు దళారులంతా కలిసి రైతుల బలహీనతను ఆసరా చేసుకుని తక్కువ ధర చెబుతున్నారు. నిజామాబాద్ మార్కెట్కు ఆమ్చూర్ను తీసుకు వచ్చే వారంతా తిరిగి పంటను తీసుకెళ్లలేరనే నమ్మకంతో వ్యాపారులు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదేంటని అడిగితే ఇష్టమొచ్చినోళ్లకు చెప్పుకోండి. ఏం చేస్తారో చేసుకోండంటూ వ్యాపారులు బెదిరిస్తుండడంతో చేసేదిలేక రైతులు పంటను తక్కువ ధరకే అమ్ముకుని తిరుగుముఖం పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోనే విస్తరించి ఉన్నది. ఈ ప్రాంతం నుంచే రైతులు భారీగా ఆమ్చూర్ను తీసుకువస్తున్నారు. ఆమ్చూర్ను ఉమ్మడి మహబూబ్నగర్, వికారాబాద్ ప్రాంతాల్లో పండిస్తున్నప్పటికీ వారికి మార్కెట్ సౌలభ్యంలేదు.
దీంతో 220 కిలో మీటర్ల దూరంలోని నిజామాబాద్ మార్కెట్కు ఆమ్చూర్ను తీసుకువచ్చి దళారుల చేతుల్లో మోసపోతున్నారు. గతేడాది రూ.20వేల ధర లభించింది. ఇప్పుడు క్వింటాలు ఆమ్చూర్ను రూ.8వేలు నుంచి బేరం ఆడుతుండడంతో సాగుదారులంతా విలవిల్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో మరెక్కడాలేని ఆమ్చూర్ మార్కెట్ కేవలం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లోనే వేసవి కాలంలో కొనసాగుతుంటుంది. పసుపు పంట ముగింపు సమయంలో ఆమ్చూర్ వస్తున్నది. వారంరోజులుగా ఆమ్చూర్ రాక మొదలవ్వగా వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు నిర్ణయిస్తుండడంతో ఈ పరిస్థితులు దాపురించాయని రైతులు వాపోతున్నారు. క్వింటాలు ఆమ్చూర్కు కనీసం రూ.30 వేల నుంచి రూ.35వేలు పలికితే కానీ మామిడి రైతులకు గిట్టుబాటు కాదు. అలాంటిది ఇప్పుడు ఆమ్చూర్ నాణ్యతను అనుసరించి కనిష్ఠంగా రూ.8వేలు నుంచి ధర మొదలవుతున్నది. ఆమ్చూర్కు దేశ, విదేశాల్లో గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నారు. మామిడి చెట్ల నుంచి కాయలను తీసి ఆమ్చూర్ను తయారుచేయడం రెండు నెలల పని. మామిడి కాయలు కోసి వరుగులా చేస్తారు. ఈ పొడిని చింత పండు స్థానంలో వాడుకుంటారు. ఉత్తర భారతదేశంతో పాటు ఇతర దేశాలకు ఆమ్చూర్ను నిజామాబాద్ నుంచి వ్యాపారులు ఎగుమతి చేస్తారు.
ఏటా మామిడి చెట్లను గుత్తకు పట్టుకుని రెండు నెలల పాటు కష్టపడి ఆమ్చూర్ను తీసుకువస్తాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘోరమైన ధర పలుకుతున్నది. క్వింటాలు ధర రూ.17వేల చొప్పున తీసుకువచ్చి మూడున్నర క్వింటాళ్లు అప్పజెప్పాను. ఉల్టా రూ.లక్ష అప్పు మిగిలింది. మార్కెట్లో బహిరంగంగానే మోసం చేస్తున్నారు. మామిడి చెట్లు పట్టుకున్న తర్వాత చెడగొట్టువానలతో కాయ చాలావరకు రాలిపోయింది.