(పున్న శ్రీకాంత్)
Adani | యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): వారిది రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. ఏ పూటకు ఆ పూట పని చేసుకుంటూ కుటుంబాలను వెళ్లదీస్తున్న పేదలు వారు. కుల వృత్తులనే నమ్ముకొని జీవితాలను నెట్టుకొస్తున్న నిస్సహాయులు. ఉన్నంతలో సాఫీగా సాగుతున్న వారి కుటుంబాల్లో అదానీ కంపెనీ మంటలు రేపుతున్నది. చేతినిండా దొరికే ఉపాధికి గండి కొట్టే ప్రమాదం నెలకొంది. రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ స్థాపనతో చుట్టుపక్కల ఉన్న పద్మశాలి, గౌడ్, ముదిరాజ్, గొల్లకురుమలు వృత్తితోపాటు ఉపాధికి దూరం కానున్నారు. మరోవైపు వర్తక, వ్యాపారాలు దివాలా తీయనున్నాయి. ఇంత కోల్పోయినా కంపెనీ ఏర్పడితే ఆ సంస్థ తొలి విడతలో ఇచ్చేది కేవలం 90 కొలువులు మాత్రమే. అంతిమంగా ఉన్న ఊరు.. కట్టుకున్న ఇల్లు వదిలి పెట్టి స్థానికులకు వలసలే దిక్కు కానున్నాయి.
డ్రైపోర్టు ముసుగులో భూముల కొనుగోళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో లాజిస్టిక్ పార్కు, డ్రైపోర్టు కోసం రైతుల నుంచి కొనుగోలు చేసిన భూముల్లో కాలుష్య కారక సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. 65.5 ఎకరాల్లో కంపెనీ స్థాపనకు రూ.1,400 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్టాండ్ అలోన్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో ఏటా 6.0 ఎంఎంటీపీఏ సిమెంట్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారు. ఈ నెల 23న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. సిమెంట్ పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు ప్రభుత్వం, అదానీని తప్పుబడుతూ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. పరిశ్రమ స్థాపన నిర్ణయాన్ని ఉపసహించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కళ తప్పనున్న సిరిపురం చేనేత!
అదానీ సంస్థ ప్రతిపాదించిన సిమెంట్ పరిశ్రమ జనావాసాలకు వందల మీటర్ల దూరంలోనే ఉంది. రామన్నపేటకు 500 మీటర్లు, కొమ్మాయిగూడెం 500, సిరిపురం గ్రామం కిలోమీటరు పరిధిలో ఉంది. రామన్నపేట రైల్వే స్టేషన్ పక్కనే దీన్ని ప్రతిపాదించారు. ఇవే కాకుండా మరో 10 గ్రామాలు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పరిశ్రమ ప్రభావం సుమారు 10 కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సిరిపురం కిలోమీటరు దూరంలోనే ఉంది. చేనేత వస్ర్తాలకు పేరుగాంచిన సిరిపురం ఇక కళావిహీనంగా మారే అవకాశం ఉంది. శబ్ద, వాయు, జల కాలుష్యంతో నేతన్నలు చేనేత ప్రభను కోల్పోనున్నారు. కంపెనీ కాలుష్యం వల్ల రాత్రి సమయంలో ప్రజలు ఆరు బయట, ఇంటి పైన పడుకుంటే పొగ, దుమ్ము, ధూళి మీద పడి తెల్లవారేసరికి మనిషి బొమ్మ మాదిరి అచ్చుదింపినట్టు అయిపోతాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూలుకు రంగులు అద్దడం, అలుగు చాపడం, ఆరబెట్టడం తదితర పనులన్నీ ఆరుబయటే చేస్తారు. సిమెంట్ దుమ్ము గాలిలో నుంచి వచ్చి వాటిపై పడితే వస్త్రం నాణ్యత లోపిస్తుందని, రంగు మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. సిరిపురంతోపాటు రామన్నపేట, బోగారం, ఇంద్రపాలనగరం, వెల్లంకి, జనంపల్లిలో చేనేత కార్మికులు వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు.
మత్స్యకారుల మనుగడ సాగేదెలా?
సిమెంట్ పరిశ్రమకు రోజూ సుమారు 6 లక్షల లీటర్ల నీరు అవసరం అవుతుందని సదరు కంపెనీ నివేదికలో పేర్కొన్నది. ధర్మారెడ్డిపల్లి కాల్వ సామర్థ్యమే 3 లక్షల లీటర్లు. మిగతా 3 లక్షల లీటర్ల నీటిని వర్షాలతోపాటు కృత్రిమ వనరుల ద్వారా సృష్టిస్తామని రిపోర్టులో పేర్కొన్నారు. అంతేగాక, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 12 చెరువుల్లో నీటి వనరులు ఉన్నాయని పొందుపరిచారు. ఇందులో కొమ్మాయిగూడెం చెరువు, రామన్నపేట, పెద్దకాపర్తి, వెల్లంకి, వెలిమినేడు, నీర్నెముల, నందనపల్లి, జనంపల్లి, శివనేనిగూడెం, ఇస్కిళ్ల, మునిపంపుల, ఇంద్రపాలనగరం చెరువులను చూపించారు. ఒకవేళ వర్షాలు పడకుంటే పరిస్థితి ఏంటని, నీటిని ఎక్కడి నుంచి సరఫరా చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నివేదికలో పేర్కొన్న చెరువుల నుంచే నీటిని తరలించాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ మురికి కూపంగా మారే ప్రమాదం ఉండగా, కంపెనీ దగ్గర నుంచి ఇది 16 గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. ఆయా గ్రామాల చెరువులు జలవ్యర్థాలతో మురికి కూపంగా మారనున్నాయి. నీరు తగ్గడంతోపాటు, విషతుల్యంగా మారడంతో మత్స్య సంపద పెరుగుదల ఆగిపోతుంది. దీంతో చెరువులపై ఆధారపడి బతుకుతున్న మత్స్యకారులు తమ ఉపాధిని కోల్పోతారు. ఫలితంగా వందలాది కుటుంబాలు రోడ్డున పడతాయి.
ఉరితాళ్లుగా మారనున్న గౌడన్నల మోకులు..
సిమెంట్ పరిశ్రమ ఏర్పడితే గౌడన్నలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కంపెనీతో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. తాటిచెట్లు, ఈత చెట్ల ఎదుగుదల ఆగిపోతుంది. ప్రస్తుతం ఉన్న చెట్లు సైతం దుమ్ము, ధూళితో రంగు మారే అవకాశం ఉంది. కల్లు రంగుతోపాటు రుచి కూడా మారుతుంది. ఫలితంగా ఈ కల్లును ఎవరూ తాగేందుకు ముందుకు రారు. ఇప్పటికే మూసీ పరీవాహక ప్రాంతాల్లో తాటి, ఈత చెట్ల కల్లును కొనే పరిస్థితి లేదు. చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో పెద్దఎత్తున గౌడన్నలు కల్లు గీస్తారు. ప్రధానంగా కొమ్మాయిగూడెంలో అందరూ గౌడ్ సామాజిక వర్గం వారే ఉన్నారు. ఇక సిమెంట్ పరిశ్రమ ఏర్పడితే గౌడన్నలు సంపాదించే అరకొర డబ్బులు కూడా కోల్పోయి ఉపాధికి గండి పడనుంది.
గొల్ల కురుమల జీవాలు బతికేదెలా?
కంపెనీ ఏర్పాటు చేయబోయే ప్రదేశం చుట్టుపక్కల రెండు, మూడు గుట్టలు ఉన్నాయి. కాలుష్యంతో చెట్లు, చేలు ధ్వంసం కానున్నాయి. గొల్లకురుమలు వారి మేకలు, గొర్రెలను అక్కడే మేపుతుంటారు. ఇకపై వాటికి గ్రాసం కష్టంగా మారుతుంది. దొరికినా అప్పటికే కాలుష్యమై పోవడంతో జీవాలు కూడా బతుకలేని పరిస్థితి దాపురిస్తుంది. వాయు, శబ్ద కాలుష్యం గొర్రెలు, మేకలు బతకడంపైనా ప్రభావం చూపుతాయి. మరోవైపు వర్తక, వ్యాపారాలు కూడా దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. రామన్నపేట ఒకప్పటి శాసనసభ నియోజకవర్గ కేంద్రం. అన్ని రకాల వర్తక, వ్యాపారాలు ఇక్కడ నడుస్తుంటాయి. కాలుష్యానికి జనాలు వలస వెళ్లే పరిస్థితి దాపురిస్తే అన్ని వ్యాపారాలు దెబ్బతినక తప్పదు.
భూముల రేట్లు అథఃపాతాళానికే..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం రామన్నపేట పరిధిలో ఏరియాను బట్టి ఎకరాకు రూ.60 లక్షల నుంచి రూ. 80 లక్షల దాకా పలుకుతున్నది. పరిశ్రమ స్థాపిస్తే కొన్ని రోజుల తర్వాత భూమి బూడిద రంగు, పసుపు, ముదురు గోధుమ రంగులోకి మారే ప్రమాదం ఉంది. ప్రతిరోజూ విడుదలయ్యే వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి నింపడంతో సారవంతమైన భూములు పూర్తిగా దెబ్బతింటాయి. వ్యవసాయం అంతంత మాత్రంగానే సాగు కానుంది. ఫలితంగా భూములు కొనడానికి కూడా ఎవరూ ముందుకు రారు. అంతిమంగా అతి తక్కువ ధరకు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్లే కొనాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అదానీ ఇచ్చేది 90 ఉద్యోగాలే
అదానీ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటైతే వేలాదిమంది ఉపాధి కూలీలపై దెబ్బ పడుతున్నది. ఆ సంస్థ ఇచ్చేది 90 ఉద్యోగాలే. కంపెనీని రెండు విడతలుగా ఏర్పాటు చేయనుండగా మొత్తంగా 180 ఉద్యోగాలు ఇస్తామని సంస్థ ప్రకటించింది. అందులోనూ తొలి విడతలో 90 మందికే ఇస్తామని స్పష్టంచేసింది. వాటిలో 15 రెగ్యులర్, 75 కాంట్రాక్టు పోస్టులు ఉంటాయని తే ల్చింది. అర్హతను బట్టి ప్రాధాన్యం ఇస్తామని కొర్రీలు పెట్టింది. అవి కూడా ఏ పోస్టులు అనేది స్పష్టం చేయలేదు. అటెండర్, అసిస్టెంట్ స్థాయి పోస్టులు తప్ప తమకేం ఇస్తారని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం
మండలంలో ఎట్టి పరిస్థితిలోనూ అంబుజా సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయనివ్వం. పరిశ్రమ ఏర్పాటు చేస్తే 10 కిలోమీటర్ల మేర వ్యవసాయం, కుల వృత్తులపై ఆధారపడి జీవించే చేనేత, గీత కార్మికులు, మత్స్యకార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. సిమెంట్ పరిశ్రమను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 23న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం.
– కంభంపాటి శ్రీనివాస్, పల్లివాడ, రామన్నపేట మండలం
చేనేత వృత్తి పోయి ఉపాధి కోల్పోతాం
సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే చేనేత వృత్తి దెబ్బతింటుంది. ఈ వృత్తిలో ఆరబెట్టడం, రంగులు అద్దడం వంటి ప్రక్రియను ఆరుబయటే చేయవలసి వస్తుంది. సిమెంట్ కంపెనీ వల్ల వచ్చే దుమ్ము, దూళితో వస్ర్తాల నాణ్యత దెబ్బతింటుంది. తద్వారా మార్కెట్లో వస్ర్తాల డిమాండ్ తగ్గిపోతుంది. ఫలితంగా చేనేత పరిశ్రమ మనుగడ ప్రమాదంలో పడుతుంది.
– పున్న వెంకటేశం, చేనేత కార్మికుడు, వెల్లంకి, రామన్నపేట మండలం
సిమెంట్ పరిశ్రమతో గీత వృత్తికి ముప్పు
మండలంలో వేల కుటుంబాలు గీత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చే రసాయనాలు, దుమ్ము, దూళి వల్ల కల్లు కలుషితమై వృత్తికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దాంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఆలోచనను విరమించుకోవాలి.
– కూనూరు వెంకటేశం, గీత కార్మికుడు, సిరిపురం, రామన్నపేట మండలం